ఎవరికీ అంతగా తెలియని షడారణ్య క్షేత్రం "తెన్నంగూర్" ప్రత్యేకత ఏమిటి ?!

తమిళనాడు రాష్ట్రంలో తిరువణ్ణామలై జిల్లాలోని వందవాసి తాలూకాలో "తెన్నంగూర్" అనే ఒక ఊరు ఉంటుంది. ఇది కాంచీపురానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆరు అడవుల మధ్య ఉన్నందుకు తెన్నంగూర్ గ్రామాన్ని షడారణ్య క్షేత్రం అని పిలిచేవారు. 

ఈ ఊరిలో నెలకొన్న శ్రీ మీనాక్షీ సుందరేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది.

Thennangur Temple

పాండ్య రాజు అయిన మలయధ్వజుడు, అతని భార్య కాంచనమాల దంపతులకు ఎంతో కాలంగా పిల్లలు లేకపోవడంతో ఈ తెన్నంగూర్ గ్రామంలో పుత్రకామేష్టి యాగం చేస్తారు. అప్పుడు పవిత్ర జ్వాలల నుండి ఒక ఆడపిల్ల ఉద్భవిస్తుంది. పాండ్య రాజు దంపతులు ఆమెకు మీనాక్షి అని పేరు పెట్టి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. 

మీనాక్షి దేవి యుక్త వయసుకు వచ్చినపుడు పాండ్య రాజు ఆమెను తన రాజ్యానికి వారసురాలు పట్టాభిషేకం చేయడం, ఆ తర్వాత పరమశివునికి ఇచ్చి వివాహం చేయడం మనందరికీ తెలిసిన విషయమే !!

Thennangur Temple

సాక్షాత్తూ మదురై మీనాక్షి దేవి ఇక్కడ జన్మించడం వల్ల ఈ వూరికి "దక్షిణ హలాస్యం" అనే పేరు వచ్చింది.

| అదనపు సమాచారం: కాంచీపురంలో చాలా "చిత్ర"మైన ఆలయం !!

స్వామి జ్ఞాననంద గిరి వారి శిష్యుడు అయిన స్వామి హరిధోస్ గిరి (గురూజీ) వారు తన గురువు గారి పేరు మీదుగా 1985 సంవత్సరంలో తెన్నంగూర్ గ్రామంలో ఒక ఆశ్రమం స్థాపించారు. కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖర స్వామి వారి ఆజ్ఞ ప్రకారం, అలాగే ఇంతకు ముందు జరిగిన స్థల పురాణానికి గుర్తుగా, గురూజీ వారు శ్రీ మీనాక్షీ సుందరేశ్వర స్వామి వార్ల ఆలయాన్ని నిర్మించి, జనవరి 1996లో కుంభాభిషేకం నిర్వహించారు.

Thennangur Temple

శ్రీ మీనాక్షీ సుందరేశ్వర స్వామి వార్ల ఆలయంలో వారి సంతానమైన గణపతి, సుబ్రమణ్య స్వామి వార్లకు కూడా  ఉపాలయాలు ఉంటాయి. మరొక విశేషం ఏమిటంటే, ఈ ఆలయ ప్రాంగణంలో వేంచేసిన నవగ్రహాలు వారి వారి భార్యలతో పాటు వారి వారి వాహనాలపై కూర్చుని ఉండడం చూడవచ్చు. 

నవగ్రహ పూజకు నవ ధాన్యాలు: Sri Yagnaa - Navadhanyalu for Navagraha Pooja (100 gms each)
Advertisement*

ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది.

Thennangur Temple

శ్రీ మీనాక్షీ సుందరేశ్వర స్వామి వారి ఆలయం చేరువలోనే స్వామి హరిధోస్ గిరి వారు శ్రీ పాండురంగ స్వామికి ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. చాళుక్య మరియు ఒడిషా నిర్మాణ శైలిలతో మిళితమైన ఈ ఆలయం చూపురులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 

ఈ క్షేత్రంలో స్థల వృక్షం- తమాల చెట్టు (Bay Leaf / బిర్యానీ ఆకు). ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు తమాల చెట్టు నీడలోనే సేద తీరుతూ వేణువు వాయిస్తూ ఉండేవాడు.

Thennangur Temple

శ్రీ పాండురంగ స్వామి వారి విగ్రహం 12 అడుగుల ఎత్తులో ఎంతో రాజసంగా, ఆయన దేవేరి అయిన శ్రీ రుక్మిణీ దేవి 10 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయంలో శ్రీ పాండురంగ స్వామి వారికి రకరకాల అలంకరణలు చేస్తుంటారు. 

శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి వార్లు: Pandaripuram Lord Sri Panduranga Vittal & Rukmini - Photo Frame with Back Stand (4" X 6")
Advertisement*

ప్రతీ ఆదివారం రాజస్థాన్ యువరాజుగా, తమిళ పురటాసి మాసంలో ప్రతీ శనివారం వేంకటేశ్వర స్వామి వారిలా, కేరళ నూతన సంవత్సరం రోజున గురువాయూరప్ప మాదిరిగా, గోకులాష్టమి రోజున వేణుగోపాల స్వామి వారిలా చేసే అలంకరణలు ఎంతో అద్భుతంగా ఉంటాయి.

Thennangur Temple

ఇక ఆరుద్ర దర్శనం (పుష్య పౌర్ణమి) రోజున, శ్రీ మీనాక్షీ సుందరేశ్వర స్వామి మరియు శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి వార్ల ఆలయం నుండి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి గ్రామంలో అందరూ ఒక చోట సమావేశం అవుతారు. ఆ విధంగా తెన్నంగూర్ ప్రాంతం శైవ-వైష్ణవ ఐక్యతకు ప్రతీకగా కూడా నిలుస్తోంది !!

| అదనపు సమాచారం: చెన్నైలో తప్పకుండా చూడాల్సిన ట్రిప్లికేన్ శ్రీ పార్థ సారధి ఆలయం !! (108 దివ్యదేశం)

ఈ తెన్నంగూర్ గ్రామంలో శ్రీ జ్ఞాననంద గిరి పీఠం వారి ఆధ్వర్యంలో నడపబడుచున్న మహా షోడశి అమ్మవారి ఆలయం మరియు పురాతన లక్ష్మీ నారాయణ ఆలయం కూడా తప్పకుండా చూడాలి.

జై రాధే కృష్ణ !!

Comments

Post a Comment