కాంచీపురంలో చాలా "చిత్ర"మైన ఆలయం !!
లేఖిని హస్తాయ విద్మహే పత్రధరాయ ధీమహి తన్నో చిత్ర ప్రచోదయాత్ !!
సాధారణంగా చిత్రగుప్తుడికి ఆలయం ఉండడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. కాంచీపురంలో బస్ స్టాండ్ కి సమీపంలో ఉన్న శ్రీ చిత్రగుప్త స్వామి వారి ఆలయం అందులో ఒకటి. ఈ ఆలయాన్ని 9వ శతాబ్ధంలో చోళ రాజులు నిర్మించారు.
యమధర్మరాజు గారి కొలువులో ఉండే చిత్రగుప్తుడు మనుషులు చేసే పాపపుణ్యాలకు చిట్టాలు రాస్తూ, వారు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమా లేదా నరకమా అని తేల్చి చెబుతాడని మనకు తెలుసు. అందుకే ఈ ఆలయంలో మూలమూర్తి కుడిచేతిలో కలం, ఎడమచేతిలో చిట్టా పట్టుకుని, ఆశీనుడై ఉన్న భంగిమలో దర్శనం ఇస్తాడు.
బంగారు తొడుగులతో నిండి ఉన్న ఈ మూలమూర్తి, స్వర్ణతాపడం చేసిన గర్భగుడి మధ్యలో, నూనె దీపాల కాంతిలో ధగధగా మెరుస్తూ, దర్శనం ఇస్తూంటే చూడడానికి రెండు కళ్ళూ చాలవు.
| అదనపు సమాచారం: ఏకాదశి రోజున మాత్రమే దర్శనం: చాలా మందికి తెలియని కాంచీపురం వైకుంఠ పెరుమాళ్ ఆలయం !!
చిత్రగుప్తుడి యొక్క భార్య పేరు కర్ణికాంబాళ్. వీరిద్దరి పంచలోహ ఉత్సవమూర్తులను ఈ ఆలయంలో ఒక చోట చూడవచ్చు.
ప్రతి నెల పౌర్ణమి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే మే నెలలో వచ్చే “చిత్ర పౌర్ణమి” రోజున జరిపే ఉత్సవం మరింత విశేషంగా ఉంటుంది.
బ్రహ్మగారి శరీరం నుంచి ఉద్భవించిన చిత్రగుప్తుడు, కేతు గ్రహానికి ప్రత్యది దేవత కావడం వల్ల ఈ ఆలయం కేతు పరిహార స్థలంగా కూడా ప్రసిద్ధి చెందినది.
ఇక ఈ ఆలయం వెనుకన ఉన్న ఒక మండపంలో- భక్తులు తమ పాపాలు మరియు ఇతర దోషాల పరిహారార్థం ఏడు నేతి దీపాలను వెలిగించడం ఇక్కడ చాలా సర్వసాధారణంగా కనిపిస్తుంది.
చిత్రగుప్త స్వామి వారి ఆలయానికి వెలుపల ఒక ప్రక్కన వినాయకుడికి, మరో ప్రక్కన రామలింగ వల్లాలర్ స్వామికి ప్రత్యేకంగా మందిరాలు ఉంటాయి. అలాగే ఈ ఆలయ ప్రాంగణం లోపల అయ్యప్ప స్వామిని, విష్ణుదుర్గ అమ్మవారిని మరియు నవగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు.
నవగ్రహ పూజకు నవ ధాన్యాలు: Sri Yagnaa - Navadhanyalu for Navagraha Pooja (100 gms each) |
Advertisement* |
శ్రీ చిత్రగుప్త స్వామివారి ఆలయం ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు తెరిచి ఉంటుంది.
ఓం శ్రీ చిత్ర గుప్తాయ నమః !! మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!
Comments
Post a Comment