జపాన్ లో గణేశుడు: టోక్యో కొండ పైన గణపతి ఆలయం !!
జపాన్ లో బాగా విస్తృతమైన బౌద్ధ మతంలో, మన గణేశుడుని కాంగిటెన్ లేదా షోడెన్ అనే పేర్లతో కొలుస్తారు. టోక్యో మహానగరంలో సుప్రసిద్ధమైన మత్సుచియమ షోడెన్ ఆలయం (Matsuchiyama Shoden Shrine) అసకుస (Asakusa) అనే ప్రాంతంలో ఒక చిన్న కొండపై ఉంటుంది. జపనీయుల భాషలో యమ అంటే కొండ లేదా పర్వతం అని అర్థం.
ఈ ఆలయం పచ్చటిచెట్ల మధ్య ప్రకృతి రమణీయత మరియు చిన్న సెలయేరులతో ఎంతో శోభాయమానంగా విరాజిల్లుతోంది. ఇక్కడ నుంచి చూస్తే, టోక్యో నగరానికి తలమానికంగా చెప్పబడే స్కై ట్రీ టవర్ (Sky Tree Tower ) చాలా స్పష్టంగా కనబడుతుంది.
బౌద్ధ మతంలో టెండై (Tendai) అనే శాఖకు చెందిన మత్సుచియమ షోడెన్ ఆలయం 601 సంవత్సరంలో స్థాపించబడినదిగా చెబుతారు. అయితే యుద్ధ సమయంలో ఈ ఆలయం పూర్తిగా ధ్వంసం అవడం వల్ల దీనిని తిరిగి 1961లో పునర్నిర్మించారు.
| అదనపు సమాచారం: జపాన్ పార్క్ లో మన చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవికి ఒక ఆలయం
కాంగిటెన్ దేవుడికి రెండు చిహ్నాలు ఉంటాయి- ఒకటి ముల్లంగి దుంప, మరొకటి డబ్బు సంచి. తెల్లగా నవనవలాడుతున్న ముల్లంగి దుంప స్వచ్చతకు, శరీర ఆరోగ్యానికి మరియు అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు. అలాగే పెనవేసుకున్న ముల్లంగి దుంపలు భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు మరియు వారి సంతానానికి గుర్తుగా భావిస్తారు.
ఇక డబ్బుసంచి వ్యాపారంలో అభివృద్ధిని సూచిస్తుంది. అందుకే వివాహ సమస్యలతో సతమతమవుతున్నవారు, సంతానంలేమితో బాధపడ్తున్న దంపతులు లేదా వ్యాపారంలో నష్టాలు చవిచూస్తున్నవారు ఈ గణపతి ఆలయానికి వచ్చి వారి కష్టాలను కడతీర్చమని ప్రార్థిస్తారు.
ఈ ఆలయ ముందు భాగంలో ప్రవేశ ద్వారానికి కుడి వైపున, కరుణత్వానికి చిహ్నంగా చెప్పబడే కన్నోన్ (Kannon) అనే ఒక దేవతారూపం ఉంటుంది. చదువు, రకరకాల కళలు లేదా వ్యాపారంలో ఉన్నతాభివృద్ధిని కాంక్షించే వారు ఈ కన్నోన్ దేవతను పూజిస్తారు.
సంపద మరియు శ్రేయస్సులను ఇచ్చే లక్ష్మీ గణపతి: INDICAST Laxmi Ganesh Idol - Brass, 2" |
Advertisement* |
అలాగే ఎడమ వైపున, జిజో అనే మరొక దేవునికి ఒక చిన్న మందిరం ఉంటుంది. బాలుని రూపంలో ఉండే ఈ బోధిసత్వుడు వారి తల్లిదండ్రుల కంటే ముందే మరణించిన పిల్లలకు మరియు పుట్టబోయే పిల్లలకు రక్షకుడిగా భావిస్తారు.
ఈ ఆలయ ఆవరణలో బౌద్ధ ఆలయాన్ని తలపించే 1781 నాటి ఒక కంచు గోపురం నమూనా చూడవచ్చు. ఈ సాంస్కృతిక కళాఖండానికి హొక్యోఇన్-తొ (hokyoin-to) అని పేరు.
ప్రధాన ఆలయానికి వెనుక ఒక చిన్న మందిరంలో ఇనారి (Inari) అని పిలవబడే ఒక క్షేత్ర పాలకుడు ఉంటాడు. ఆయనకు వాహనంగా మరియు దూతలుగా వ్యవహరించబడే రెండు నక్కలను ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు.
మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!
Comments
Post a Comment