జపాన్ పార్క్ లో సరస్వతీ దేవికి ఆలయం (Inokashira Benzaiten Shrine at Tokyo)
మన హిందూ దేవీదేవతా స్వరూపాలను బౌద్ధ మతంలో కూడా ఆరాధిస్తారు అనే విషయం మీకు తెలుసా? బౌద్ధ మతాన్ని పాటించే జపాన్ లో విఘ్నాలను తొలగించే గణపతికి, సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుడుకి, అష్ట ఐశ్వర్యాలను ఇచ్చే లక్ష్మీదేవికి అలాగే చదువుల తల్లి అయిన సరస్వతీ దేవి వంటి వారికి తగిన ప్రాముఖ్యత ఉంది.
జపాన్ లో సరస్వతీ దేవిని బెంజైటెన్ (Benzaiten) అనే పేరుతో కొలుస్తారు. ఈమె ఒక చేతిలో బివ (Biwa) అనే వీణను ధరించి సంగీత సాహిత్యాలకు, లలిత కళలకు అలాగే సిరి సంపదలకు అదృష్ట దేవతగా ఇక్కడ పూజలు అందుకుంటోంది. టోక్యోలోని ఇనోకాషిరా (Inokashira) అనే పార్క్ లో సరస్వతీ దేవికి ఒక ఆలయం ఉన్నది.
సరస్వతీ వీణ: henkumari Wooden Miniatuure Veena |
Advertisement* |
95 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ఇనోకాషిరా పార్క్ టోక్యో మహానగరంలో 1917వ సంవత్సరంలో ఏర్పడింది. దట్టమైన పచ్చని చెట్ల మధ్య చక్కటి నీటి వనరులతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన ఈ పార్క్ అందరి దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ పార్క్ లో బోట్ క్లబ్ తో పాటు జూ, అక్వేరియం మరియు మ్యూజియం వంటివి కూడా ఉన్నాయి.
ఇక విషయానికి వస్తే, చాలా ప్రశాంతమైన వాతావరణంలో నెలకొన్న ఈ ఇనోకాషిరా బెంజైటెన్ ఆలయం ఒక చెరువుకి అనుకుని ఉంటుంది. ప్రతి రోజు వాకింగ్ లేదా జాగింగ్ చేసే వారితో ఈ పార్క్ అంతా చాలా హడావుడిగా ఉంటుంది. సరస్వతి మాత ఆలయం ఈ దారిలోనే ఉండడంతో వారు కూడా అమ్మవారిని దర్శించి, నమస్కరించి వెళ్ళడం చూడవచ్చు.
సాధారణంగా బెంజైటెన్ ఆలయాల్లో మాత్రమే కనిపించే ఉగాజిన్ (Uga-jin) అనే ఒక నాగ దేవతను పాడి పంటలకు, సంతానానికి ప్రతీకగా భావిస్తారు. అలాగే కొన్నిచోట్ల సరస్వతీ దేవి తన శిరస్సుపై ఈ నాగరాజును ధరించి ఉండటం వల్ల, అమ్మవారికి ఉగా బెంజైటెన్ (Uga Benzaiten) అని కూడా పేరు ఉంది.
| అదనపు సమాచారం: టోక్యో షేర్ మార్కెట్ కి సంరక్షక దేవుడు ఎవరో తెలుసా ?!
ఈ ఆలయ ఆవరణలో ఇతర పరివార దేవతలకు ప్రత్యేకంగా మందిరాలతో పాటు వివిధ రూపాల్లో ఉన్న బోధిసత్వుని విగ్రహాలు కూడా ఉండడం చూడవచ్చు. రూపు రేఖల్లో కొంచెం తేడా ఉన్నప్పటికీ, మనలాగే జపనీయులు కూడా మన పూజించే దేవీదేవతలను కొలుస్తుంటే కొంచెం ఆశ్చర్యం గానూ, చాలా సంతోషంగానూ ఉంది కదా !! ఓం శ్రీ సరస్వత్యై నమః !!
మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!
Comments
Post a Comment