తిరుమల శ్రీవారి పుష్కరిణి ఎన్నో రహస్యాలకు నెలవు, వాటిలో మీకు ఎన్ని తెలుసు ?!
శాస్త్రాణాం పరమో వేదః దేవానాం పరమో హరిః !
తీర్థానాం పరమం తీర్థం స్వామిపుష్కరిణీ నృప !!
అన్ని శాస్త్రాలలో గొప్పది వేదం, సకల దేవతలలో ఉత్తముడు శ్రీవేంకటేశ్వర స్వామి, ఇక తీర్థాల్లో ఉత్తమమైనది తిరుమల మాడ వీధుల్లోని ఈశాన్య దిక్కులో నెలకొని ఉండే స్వామివారి పుష్కరిణి.
శ్రీమహావిష్ణువు ఆజ్ఞమేరకు, గరుత్మంతుడు వైకుంఠం నుంచి పుష్కరిణిని తెచ్చి తిరుమల క్షేత్రంలో స్థాపించినట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణం కలిగిన శ్రీవారి పుష్కరిణి సర్వ తీర్థాలకు నిలయం.
ఇందులో ఉత్తరం వైపున వరాహ పుష్కరిణి, మధ్యలో ఉన్న నీరాళి మండపం వద్ద సరస్వతీ నది సమ్మేళనమై ఉంటాయి. అంతే కాకుండా పుష్కరిణికి ఎనిమిది దిక్కులలో ఐదుగురు అష్టదిక్పాలకులు మరియు ముగ్గురు మహర్షులు తమ శక్తులు ధారపోసి స్వామి పుష్కరిణిని మరింత మహిమాన్వితం చేశారు.
ఇంకా ధనుర్మాసంలో వైకుంఠ ద్వాదశి సూర్యోదయం వేళ, అంటే కూర్మ ద్వాదశి రోజున, ముల్లోకాల్లో ఉన్న సమస్త తీర్థాలన్నీ వచ్చి చేరుతాయి. ఆ రోజును “శ్రీ స్వామి పుష్కరిణి తీర్ధ ముక్కోటి" అనే మహా పర్వదినంగా భావిస్తారు.
ఈ పుష్కరిణి గట్టున ఎన్నో ఆలయాలు, మందిరాలు కూడా విరాజిల్లుతున్నాయి. పుష్కరిణికి ఉత్తర ఈశాన్య భాగంలో శ్రీ వ్యాసరాజ వారి ఆహ్నిక మండపం చూడవచ్చును.
14వ శతాబ్ధానికి చెందిన వ్యాసరాజ తీర్థుల వారు మైసూర్ జిల్లాలోని కావేరి నదికి చేరువలో ఉన్న బన్నూరు అనే ఊరిలో జన్మించారు. ద్వైత వేదాంతంలో నిష్ణాతుడైన వ్యాస తీర్థుల వారు విజయనగర చక్రవర్తులకు గురువులుగా ప్రసిద్ధికెక్కారు.
శ్రీకృష్ణదేవరాయలువారిని కాలసర్పదోషం నుంచి రక్షించడానికి, ఈయన కొంత కాలం విజయనగరం సింహాసనం కూడా అధిష్టించాల్సి వచ్చింది. అందుకనే ఈయనను "వ్యాసరాయలు" అని కూడా అంటారు.
కలౌ వేంకటనాయకః!! ARTVARKO Tirupati Balaji Venkateshwara Murti - Brass, 3.75 Inch |
Advertisement* |
ఒకానొక కాలంలో అర్చకులు లేక తిరుమలలో స్వామివారి కైంకర్యాలకు విఘాతం కలిగినప్పుడు, ఈయనే 12 ఏళ్ల పాటు అర్చన కార్యక్రమాలు స్వయంగా చేపట్టారు. తన జీవిత చరమాంకంలో వ్యాస తీర్థుల వారు హంపికి వెళ్ళిపోయారు. ఆయన సమాధి అక్కడే తుంగభధ్ర తీరంలో “నవ బృందావనం” గా పిలవబడే ఒక దీవిలో ఇతర మధ్వ మఠాధిపతుల యొక్క సమాధుల నడుమ చూడవచ్చు.
పూర్వ జన్మలో ప్రహ్లాదుని అవతారంగా భావించబడే వ్యాసరాజ తీర్థుల వారు మరుసటి జన్మలో మంత్రాలయ రాఘవేంద్ర స్వామిగా జన్మించారని చెబుతారు.
దక్షిణ భారతదేశంలో వ్యాసతీర్థుల వారు సుమారు 732 ఆంజనేయ స్వామివారి ఆలయాలను నిర్మించారు. ఈ పుష్కరిణి ఈశాన్య భాగంలో 15వ శతాబ్ధంలో నిర్మించబడిన హనుమంతుని మందిరం కూడా వాటిలో ఒకటిగా చెప్పబడుతోంది.
పుష్కరిణి గట్టుపై వరాహస్వామి వారికి అభిముఖంగా నమస్కరిస్తున్న స్వామి హనుమను “కోనేటిగట్టు ఆంజనేయస్వామి” అని పిలుస్తారు. ఈ ఆంజనేయస్వామి వారికి ప్రతీ ఆదివారం పంచామృత అభిషేకం చేసి, అనేక నైవేద్యాలు సమర్పిస్తారు.
| అదనపు సమాచారం: తిరుమల యాత్రలో తప్పకుండా చూడాల్సిన జాపాలి తీర్థం !!
ఈ పుష్కరిణికి పశ్చిమాన కొంచెం ఎత్తులో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సన్నిధి ఉంది. అందులో శంకరాచార్యుల వారిని, ఆయన నలుగురు శిష్యులనూ దర్శించవచ్చును. ఈయనే శ్రీవారి హుండీ ఏర్పాటు చేసిన స్థలంలో శ్రీచక్రం ప్రతిష్టించారని చెబుతారు. అందువలనే శ్రీ వేంకటేశ్వర స్వామికి అంతులేని సంపద హుండీలోకి వచ్చి పడుతోందని అంటారు.
ఆదిశంకరాచార్య సన్నిధి ప్రక్కగా అశ్వత్థ నారాయణ కట్ట ఉంటుంది. శ్రీనివాసుడు తన పెండ్లికి అలకాపురి అధినేత అయిన కుబేరుని వద్ద పధ్నాలుగు లక్షల రామముద్రలు అప్పు చేసినప్పుడు ఋణపత్రంలో బ్రహ్మ, మహేశ్వరులతో పాటు ఈ అశ్వత్థ వృక్షం మూడవ సాక్షిగా ఉన్నట్లు చెబుతారు.
| అదనపు సమాచారం: శ్రీ వేంకటేశ్వరస్వామి కుబేరుడికి రాసిచ్చిన ప్రామిసరీ నోటు ఎక్కడ వుంది?
ఈ పుష్కరిణికి ఆగ్నేయం వైపున ఒక చిన్న శిలకు పసుపు రాయబడి కుంకుమ బొట్లతో ఉంటుంది. ఒక వైపు గజరాజులతో కూడిన మహాలక్ష్మి, మరొక వైపు శ్రీనివాసుడు, అన్నమయ్య తదితరులు దర్శనమిస్తారు. ఆనంద నిలయంలో స్వామివారి వక్షస్థలంలో వేంచేసిన వ్యూహాలక్ష్మి (మహాలక్ష్మి) దర్శనం కానప్పుడు, ప్రత్యామ్నాయంగా ఇక్కడ దర్శించుకోవచ్చు.
స్వామి పుష్కరిణి మధ్యలో నీరాళి మండపాన్ని 1468 సంవత్సరంలో సాళువ నరసింహరాయులు నిర్మించాడు. సంక్రాంతి మరియు బ్రహ్మోత్సవ సమయాల్లో జరిగే తెప్పోత్సవం రోజున, ఈ నీరాళి మండపంలో ఆస్థానం జరుపుతారు.
అలాగే ఫాల్గుణ మాసంలో 5 రోజులపాటు జరిగే వార్షిక తెప్పోత్సవం చాలా కన్నుల పండుగగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా, ఐదవ నాడు అంటే పౌర్ణమి రోజున శ్రీదేవి- భూదేవి సమేత మలయప్ప స్వామివార్లు తెప్పలో ఏడు చుట్లు వేసే దృశ్యాన్ని చూడడానికి వేలాది భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు.
ఇక అత్యంత పవిత్రమైన చక్రస్నానం విషయానికి వస్తే- సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున, అలాగే రథ సప్తమి రోజున, అనంత పద్మనాభ చతుర్దశి రోజున, మరియు వైకుంఠ ద్వాదశి రోజున, ఇలా నాలుగు సార్లు సుదర్శన చక్రత్తాళ్వారులకు శ్రీవారి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయిస్తారు.
శంఖంలో పోస్తేనే తీర్థం !! Thenkumari Lakshmi Shankh - Pooja Blowing Shankh, Medium size |
Advertisement* |
ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ఉభయ దేవేరిలతో వేంచేసిన శ్రీ మలయప్ప స్వామి వారికి సహస్రదీపాలంకరణ సేవ జరుగుతుంది. ఆ సేవ అనంతరం, స్వామి వారికి మాడ వీధుల్లో ఊరేగింపు జరుగుతుంది.
స్వామి వారి పల్లకి పుష్కరిణి వద్దకు రాగానే, నక్షత్ర హారతి మరియు మంగళ నీరాజనాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవే నక్షత్ర హారతి మరియు మంగళ నీరాజనాలు కూడా పుష్కరిణికి చూపించి పూలు, పండ్లు పుష్కరిణి జలాల్లో నివేదన చేస్తారు.
స్వామిపుష్కరిణీ స్నానం, సద్గురోః పాదసేవనం,
ఏకాదశీవ్రతం చాపి త్రయ మత్యంత దుర్లభమ్ !
దుర్లభం మానుషం జన్మ, తత్ర జీవనం,
స్వామిపుష్కరిణీ స్నానం త్రయ మత్యంత దుర్లభమ్ !!
శ్రీస్వామి పుష్కరిణిని దర్శించడం లేదా స్మరించడం వలన, అలాగే ఇందులో తీర్థాన్ని సేవించడం వల్ల లేదా స్నానం చేయడం వల్ల సమస్త పాపాలు తొలిగిపోతాయి.
ఓం నమో వేంకటేశాయ !!
Comments
Post a Comment