తిరుమల కొండకు గ్రామ దేవత ఎవరంటే ...
చాలా మంది తిరుమల యాత్రలో భాగంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తల నీలాలు సమర్పించి, ఆ తర్వాత ఆయన దర్శనం చేసుకుని, లడ్డూ ప్రసాదం తీసుకుని ఆదర బాదరగా ఊరికి తిరిగి వెళ్లిపోతూ ఉంటారు. తిరుమల కొండపైన చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో చాలా మందికి తెలియని, ఒక సుందరమైన ప్రదేశం గురించి ఇప్పుడు మీకు చెబుతాను !!
తిరుమల కొండపైన వరాహస్వామి గెస్ట్ హౌస్-2 కి ఎదురుగా ఉన్న రోడ్డులో, అంటే పాపవినాశనంకి వెళ్ళే కాలినడక దారిలో బాట గంగమ్మ గుడి ఉంది. బాట గంగమ్మను తిరుమల ప్రాంతానికి గ్రామ దేవతగా కొలుస్తారు. ఈవిడ శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సోదరి అవుతుందని అంటారు.
ఒకప్పుడు ఈ ప్రాంతమంతా దట్టమైన అడివితో, వన్యమృగాలు సంచరిస్తూ భయానకంగా ఉండేది. అయినా తిరుమలలోని అర్చకులు, ప్రతిరోజూ స్వామివారి అభిషేకం గురించి పాపవినాశనం నుండి పవిత్ర జలాలను మోసుకుంటూ ఈ కాలినడక దారిలోనే తీసుకుని వచ్చేవారు.
కలౌ వేంకటనాయకః!! ARTVARKO Tirupati Balaji Venkateshwara Murti - Brass, 3.75 Inch |
Advertisement* |
ఈ బాటలో వెళ్ళే అర్చకులకు ఇక్కడ స్వయంభువుగా వెలసిన గంగమ్మ తల్లి రక్ష ఇస్తూ ఉండడంతో, ఈవిడకు "బాట గంగమ్మ" అనే పేరు వచ్చింది. అందుకే కాలి నడకన ఈ మార్గంలో పాపవినాశనం వెళ్ళే భక్తులు ఇప్పుడు కూడా బాట గంగమ్మ తల్లిని తప్పనిసరిగా దర్శించుకుంటారు.
| గూగుల్ మ్యాప్ లింక్: బాట గంగమ్మ ఆలయం
బాట గంగమ్మ ఆలయం చిన్నదే అయినా, పచ్చని చెట్ల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంతో భక్తుల మనస్సు రంజింపజేస్తుంది. ఈ దేవాలయం వెనుక భాగంలో ఒక రావి చెట్టు కిందనున్న గట్టుపై శివ లింగం, నందీశ్వరుడు, వినాయకుడు, దుర్గా మాత మొదలైన పరివార దేవతలను దర్శించుకోవచ్చు. అలాగే ఈ రావి చెట్టు పక్కనే నాగ దేవతలు మరియు పాముల పుట్ట కూడా ఉన్నాయి.
నవగ్రహాలకు ప్రత్యేకంగా ఇక్కడ ఒక చిన్న మందిరం కూడా ఉంది. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆయా గ్రహాలకు ప్రీతికరమైన ధాన్యాలతో నవగ్రహాలను చక్కగా పూజించి, అలంకరించడం అనేది ఇక్కడ తప్ప మరెక్కడా కనపడదేమో !!
బాట గంగమ్మ గుడికి ఎదురుగా ఒక చిన్న మందిరంలో నాగాలమ్మ దేవత ఉంటుంది. అటు పక్కనే, దారి కాపు ఆంజనేయ స్వామివారి మందిరం అలాగే ఆయన ముందు రాములవారి పాదాలు కూడా దర్శించకోవచ్చు.
కారు ప్రయాణంలో జై హనుమాన్ !! UNOVATE Hanuman Idol for Car Dashboard - Golden, 9cm |
Advertisement* |
బాట గంగమ్మ తల్లికి ప్రతి సంవత్సరం పోటెత్తిన భక్తులతో, ఎంతో కోలాహలంగా జాతర కూడా జరుగుతుంది. ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.
| అదనపు సమాచారం: తిరుమలలో ఉండాల్సిన క్షేత్రపాలక శిల పంచపాండవ తీర్థంలో ఎందుకు వుంది?
మేము ప్రతీసారి తిరుమల కొండకు వెళ్ళినప్పుడు, స్వామివారి దర్శనం మరియు మిగతా ఆలయాలను విజయవంతంగా చూసుకున్న తర్వాత, సాధ్యమయినంత వరకూ బాట గంగమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకుంటాము. అలాగే ఊరికి క్షేమంగా తిరిగి చేరుకునేటట్లు అనుగ్రహించమని తిరుమల గ్రామ దేవత అయిన బాట గంగమ్మ తల్లిని కోరుకుంటాము.
మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!
Comments
Post a Comment