శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గడ్డంపై పచ్చ కర్పూరం ఎందుకు అద్దుతారు ??
అనంతాళ్వార్ల తోట: తిరుమల క్షేత్రంలో జరిగిన అద్భుతాలకు, చారిత్రాత్మక ఘట్టాలకు సాక్షి !!
తిరుమల మాడవీధుల్లో నైరుతి దిశలో W-1 గేట్ వద్ద "శ్రీ అనంతాళ్వార్ల తోట" ఉంటుంది. ఇందులోనే ఆయన బృందావనం (మోక్ష స్థలం) కూడా ఉన్నది. ఇది కేవలం ఒక పూల తోట కాదు. ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు, జరిగిన అద్భుతాలకు మన కంటి ముందు కనిపించే ఒక ప్రత్యక్ష సాక్ష్యం !!
అనంతాళ్వార్ శ్రీ రామానుజాచార్యులు వారి ప్రియ శిష్యుడు. అప్పట్లో తిరుమల క్షేత్రం దట్టమైన అడవితో, సంచరించే వన్య మృగాలతో, క్రిమికీటకాదులతో ఎంతో భయానకంగా ఉండేది. అయినా కానీ, గురువు గారి ఆజ్ఞ మేరకు అనంతాళ్వార్ తిరుమలలో శాశ్వత నివాసం ఏర్పరచుకుని, స్వామి వారి అర్చనాది కార్యక్రమాలు చాలా భక్తి శ్రద్ధలతో ప్రతీ రోజూ చేస్తూ ఉండేవాడు.
ఆ క్రమంలోనే రామానుజాచార్యులువారు చెప్పిన విధంగా, పుష్ప కైంకర్యానికి ఉపయోగపడే విధంగా ఒక చెరువుని తవ్వి, పెద్ద పూల తోటను పెంచాలని అనంతాళ్వార్ అనుకుంటాడు. గర్భవతైన తన భార్యతో కలిసి అనంతాళ్వార్ రోజూ మధ్యాహ్నం మండుటెండను సైతం లెక్క చేయక మట్టిని తవ్వుతూ పనిలో నిమగ్నమై ఉంటారు. వాళ్ళ అంకుఠిత దీక్షకు మెచ్చిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిద్దరినీ పరీక్షించడానికి ఒకరోజు పన్నెండేళ్ళ బాలుడి రూపంలో వచ్చి తను కూడా వారికి సహాయం చేస్తానని అంటాడు.
| అదనపు సమాచారం: తిరుమల శ్రీవారి పుష్కరిణి ఎన్నో రహస్యాలకు నెలవు, వాటిలో మీకు ఎన్ని తెలుసు ?!
తాము చేస్తున్న దైవకార్యంలో వేరే వాళ్ళు పాలు పంచుకోవడం ఇష్టం లేక, వారు తమకు ఏ సహాయం అవసరం లేదని, ఆ బాలుడిని ఇక్కడ నుంచి వెళ్ళమని చెబుతారు. అయినా ఆ బాలుడు పదే పదే వచ్చి సహాయం చేస్తాననడంతో, అనంతాళ్వార్ విసుగు చెంది, చాలా కోపంతో తన చేతిలో ఉన్న గడ్డపారను విసురుతాడు. అది పిల్లవాడి గడ్డానికి తగిలి రక్తం కారడం మొదలవుతుంది. వెనువెంటనే పిల్లవాడు ఆలయం వైపుకు పారిపోవడం కూడా జరుగుతుంది.
ఇక సాయంత్రం కావడంతో, అనంతాళ్వార్ చెరువును తవ్వే పనిని ఆపి, సంధ్యావందనం ముగించుకుని స్వామివారి పూజా కార్యక్రమాలకు ఆనంద నిలయానికి వెళతాడు. అక్కడ స్వామివారి గడ్డానికి తగిలిన గాయం చూడడంతో ఆయనకు జరిగిన విషయం మొత్తం అర్థం అవుతుంది.
| మనస్సును రంజింపజేసే శంఖం, చక్రం, నామం !! AargKraft - Shankh Chakra Namah - Brass, 2 Inches |
| Advertisement* |
తన తప్పును తెలుసుకున్న అనంతళ్వార్, వెంటనే స్వామివారి గడ్డానికి పచ్చ కర్పూరం అద్ది రక్తస్రావం ఆపుతాడు. అలాగే తాను చేసిన అపరాధాన్ని మన్నించమని ప్రార్థిస్తాడు. ఈ సంఘటనకు గుర్తుగా, స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరం అద్దే సంప్రదాయం (శ్రీవత్స చిహ్నం) ఇంకా కొనసాగుతూ ఉంది. అలాగే ఆనాడు అనంతాళ్వార్ విసిరిన గడ్డపారను మహాద్వారం వద్ద ఉత్తర దిక్కులో ఉన్న గోడపై ఇప్పటకీ చూడవచ్చు.
ఇలాంటిదే మరొక కథను మనం తెలుసుకోవాలి. సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వర స్వామివారు అనంతాళ్వార్ ని "మామా" అని సంబోధించడం ఒక అద్భుతమైన విషయమే !!
అనంతాళ్వార్ వారు పెంచిన తోటలోని సుగంధ పుష్పాలకు, రంగురంగుల పూల సోయగాలకు ముగ్ధులైన లక్ష్మీ శ్రీనివాసులిద్దరూ రోజూ రాత్రి అనంతాళ్వార్ తోటలో విహరించడానికి మారు వేషంలో వస్తూ ఉండేవారు. అక్కడున్న పుష్పాలను తెంచుతూ, నచ్చినవి వాసన చూస్తూ, బాగున్నవి సిగలో అలంకరించుకోవడం, బాగోనివి విసిరేయడం చేస్తూ అలా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని రాత్రంతా తోట మొత్తం కలియ తిరిగేవారు.
| లివింగ్ రూమ్ లేదా ఆఫీసులో అలంకరణకు: Behoma Metal Hammered Vase |
| Advertisement* |
చిందరవందరగా ఉన్న పూల తోటను పొద్దుటే లేచి చూసిన అనంతాళ్వార్ కి ఏమి జరిగిందో అర్థం కాలేదు. ఇదే తంతు ప్రతి రోజూ జరగడంతో, అనంతాళ్వార్ ఆ దొంగలెవరో పట్టుకోవాలని ఒక రాత్రి తోటలో దాక్కుని మాటు వేస్తాడు. ఎప్పటిలాగే ఆ రోజు రాత్రి లక్ష్మీ శ్రీనివాసులిద్దరూ తోటలో విహరించడానికి మారువేషంలో వస్తారు. అదను చూసి అనంతాళ్వార్ వాళ్ళిద్దరిని చెరో చేత్తో పట్టుకోబోతాడు.
కానీ శ్రీనివాసుడు మాత్రం చేయి విదుల్చుకుని తోట నుండి బయటకి పారిపోయి అప్రదక్షిణంగా ఆలయం లోపలికి వెళ్ళిపోతాడు. తన చేతికి దొరికిన లక్ష్మీదేవి వదిలేయమని ఎంతో బ్రతిమాలుకుంటున్నా వినకుండా ఒక చెట్టుకి తీగతో కట్టేస్తాడు. శ్రీనివాసుడు తిరిగి వస్తాడేమో అని ఎదురు చూస్తూ అనంతాళ్వార్ అలాగే తోటలో నిద్రపోతాడు.
ఇంతలో తెల్లవారడం జరుగుతుంది, సుప్రభాత సేవ జరుగుతున్నప్పుడు, వక్షస్థలంలో ఉన్న లక్ష్మీదేవి కనిపించకపోవడంతో అర్చకులు చాలా ఆశ్చర్యపోతారు. అప్పుడు శ్రీనివాసుడు అర్చకులకు లక్ష్మీదేవి అనంతాళ్వార్ తోటలో బందీగా ఉన్నట్లు చెబుతారు. వెంటనే అర్చకులు తోటలో నిద్రపోతున్న అనంతాళ్వార్ కు ఈ విషయం చెబుతారు.
| కలౌ వేంకటనాయకః!! ARTVARKO Tirupati Balaji Venkateshwara Murti - Brass, 3.75 Inch |
| Advertisement* |
తప్పును తెలుసుకున్న అనంతళ్వార్ లక్ష్మీదేవిని క్షమాపణ అడిగి, కట్లు విడిపించి, తానే స్వయంగా ఆమెను ఒక పూల బుట్టలో ఉంచి తలపై మోసుకుంటూ ఆనందనిలయానికి వెళతాడు. అనంతళ్వార్ తాను చేసిన అపరాధాన్ని మన్నించమని శ్రీనివాసుడిని ప్రార్థిస్తూ, లక్ష్మీదేవిని తిరిగి ఆయనకు అప్పగిస్తాడు. అనంతాళ్వార్ భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు మామా అని సంభోదిస్తూ “నీ కూతురిని పూల బుట్టలో పెట్టి నాకు సమర్పించినందుకు నీవు కన్యాదాతవైన మామగారివి !!” అంటాడు.
తోటలో జరిగిన ఈ సంఘటనను పురస్కరించుకుని, “శ్రీవారి బాగ్ సవారి” అనే ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల ముగిసిన తరువాతి రోజున జరుపుతారు. ఆ రోజున శ్రీ వేంకటేశ్వర స్వామివారు అనంతాళ్వార్ తోటకు వేంచేసి, పుష్ప మండపంలో పూజలు అందుకుని అనంతాళ్వార్ వారిని సముచిత రీతిలో పూలమాల వేసి, శఠారిలతో సత్కరించడం జరుగుతుంది.
| అదనపు సమాచారం: చెన్నై మహానగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వారి ఆలయాలు !!
ఇదే విధంగా, గోదాదేవి పుట్టిన రోజున “తిరువాడిపూరం” అనే మరో ఉత్సవం కూడా జరుపుతారు. అలాగే తిరుమలనంబి మరియు రామానుజాచార్యుల వారికి గురువైన యమునాచార్యుల పేరిట ఆనాడు అనంతాళ్వార్ ప్రారంభించిన పుష్ప కైంకర్య సేవ తిరుమలలో ఇప్పటకీ జరుగుతోంది.
అనంతాళ్వార్ తన గురువుపై ఉన్న భక్తి విశ్వాసాలకు గుర్తుగా తాను తవ్విన చెరువుకు “రామానుజ పుష్కరిణి” అనే పేరు పెట్టడం జరిగింది. అనంతాళ్వార్ “శ్రీ వేంకటాచల ఇతిహాస మాల” అనే సంస్కృత వచన గ్రంధంతో పాటు “శ్రీరామానుజ చతుశ్లోకి” మరియు “శ్రీగోదా చతుశ్లోకి” వంటి సంస్కృత శ్లోకాలను రచించాడు.
సుమారు 84 ఏండ్లు జీవించిన శ్రీ అనంతాళ్వార్ తిరుమలలోనే పరమపదం చెందారు. ఈ బృందావనంలో అనంతాళ్వార్ తన గురువు గారైన రామానుజాచార్యుల వారిని ఎంతో ప్రేమతో ఆలింగనం చేసుకుంటున్నట్లుగా, ఒక పొగడచెట్టు వేరొక మర్రిచెట్టుతో పెనవేసుకుని కనిపిస్తాయి. ఈ పొగడచెట్టే అనంతాళ్వార్ కి ప్రతిరూపంగా భావిస్తారు, అందుకే ఉత్సవాల్లో పూలమాల సత్కారం, శఠారి సమర్పణ వంటివన్నీ ఈ పొగడమానుకు దక్కుతాయి.
| అదనపు సమాచారం: శ్రీ రామానుజాచార్యుల వారి జన్మస్థలం & మోక్షస్థలం ఎక్కడ ఉన్నాయో తెలుసా?
ఇక్కడ తోటలో ఉన్న పుష్పమండపం లోపల అనంతళ్వార్ తన కుటుంబం మరియు శిష్య బృందంతో కనిపిస్తారు. అలాగే ఒక పక్క అలిమేలు మంగతాయర్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారు, మరో పక్క గోదాదేవి దర్శినమిస్తారు. ఈ మండపం గోడలపై శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన దశావతారాల రూపాలు చాలా చక్కగా తీర్చిదిద్దబడ్డాయి.
ఇక అనంతాళ్వార్ వంశంలో 26వ తరానికి చెందిన శ్రీమాన్ రంగాచార్యులు గారు ఇక్కడే నివసిస్తూ, ప్రతి రోజు స్వామి వారి సేవలో తరిస్తున్నారు.
ఈ సారి మీరు తిరుమల యాత్రకు వెళ్ళినప్పుడు తప్పకుండా శ్రీ అనంతాళ్వార్ల తోటను దర్శించండి. ఇక్కడ చెప్పిన కథలను తల్చుకుంటూ రామానుజ పుష్కరిణి, పుష్పమండపం, ఉద్యానవనం, బృందావనం చూడండి. కుదిరితే అనంతాళ్వార్ వంశస్థుల ఆశీర్వాదం కూడా తీసుకోండి !!
ఓం నమో వేంకటేశాయ !!
Comments
Post a Comment