తిరుమల రహస్యం: పంచ పాండవ తీర్థంలో క్షేత్ర పాలక శిల ఎందుకు వుంది?
సాధారణంగా శైవ క్షేత్రాలకు విష్ణుమూర్తి, వైష్ణవ క్షేత్రాలకు శివుడు క్షేత్ర పాలకుడుగా ఉండడం చూడవచ్చు. భారతదేశంలో సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం కూడా ఇదే సాంప్రదాయాన్ని అనుసరిస్తోంది.
తిరుమల ఆలయానికి క్షేత్ర పాలకుడు రుద్రుడు, అంటే శివుడు. గోగర్భం డ్యామ్ సమీపంలో ఉన్న పంచ పాండవ తీర్థంలో “క్షేత్ర పాలక శిల” ఉంటుంది. కానీ ఒకప్పుడు ఈ క్షేత్ర పాలక శిల ప్రధాన ఆలయానికి ఈశాన్య మూలలో ఉండేది.
ప్రతీ రోజూ పవళింపు సేవ అనంతరం, ఆలయాన్ని మూసివేసిన తర్వాత అర్చకులు ఆలయ తాళాలను క్షేత్ర పాలక శిలకు మూడు సార్లు తాటించడం జరిగేది. అప్పుడు ఈ క్షేత్ర పాలక శిల మాడవీధుల్లో దొర్లుతూ రాత్రంతా గస్తీ కాసేది. తెల్లవారు జామున సుప్రభాత సేవకు ఆలయాన్ని తెరిచే సమయంలో అర్చకులు మళ్ళీ ఆలయ తాళాలను క్షేత్ర పాలక శిలకు మూడు సార్లు తాటించడం జరిగేది.
అప్పుడు ఈ క్షేత్ర పాలక శిల ఇక గస్తీ తిరగడం ఆపి, తన యథాస్థానమైన ఈశాన్య మూలకు వచ్చి నిశ్చలంగా ఉండేది. అలాగే ఆలయ ఆచారాలలో భాగంగా క్షేత్ర పాలక శిలకు రోజువారీ పూజ, బలి నైవేద్యాలను సమర్పించేవారు. ఈ పద్ధతి చాలా సంవత్సరాలు పాటు సక్రమంగా కొనసాగింది.
అయితే ఒకసారి రాత్రివేళ క్షేత్ర పాలక శిల మాడవీధుల్లో గస్తీ కాస్తున్న సమయంలో తన మార్గానికి అడ్డువచ్చిన ఒక అమాయక వ్యక్తిపై దొర్లుకుంటూ వెళ్లడంతో పెద్ద ఘోరం జరిగిపోయింది.
ఇటువంటి దురదృష్ట సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదు అనే ఉద్దేశంతో, ఈ శిలను మాడవీధి నుంచి గోగర్భం డ్యామ్ దగ్గరలో ఉన్న పంచ పాండవ తీర్థానికి తరలించడం జరిగింది.
ఆ తర్వాత కూడా క్షేత్ర సాంప్రదాయాన్ని కొనసాగించటం కోసం, శ్రీవారి ఆలయంలో వెండివాకిలి వద్దనున్న ధ్వజస్తంభానికి ఈశాన్య దిశ మూలలో ఒక బలి పీఠం ఏర్పాటు చేశారు. క్షేత్ర పాలక శిలలోని కొంత భాగం తీసుకుని ఈ బలి పీఠాన్ని తయారు చేయడం జరిగింది.
ఆలయం తెరిచే సమయంలో మరియు మూసివేసే సమయంలోనూ ఇప్పటికీ అర్చకులు ఆలయ తాళాలను ఈ బలి పీఠానికి తాటించడం ఒక ఆచారంగా జరుగుతోంది.
| అదనపు సమాచారం: శ్రీ వేంకటేశ్వరస్వామి కుబేరుడికి రాసిచ్చిన ప్రామిసరీ నోటు ఎక్కడ వుంది?
ప్రతి సంవత్సరం మహా శివరాత్రి రోజున అర్చకులు, ఆలయ సిబ్బంది మేళతాళాల నడుమున పంచపాండవ తీర్థానికి వెళతారు. ఇక్కడున్న క్షేత్ర పాలక శిలపై ప్రతిష్టింపజేసిన శివలింగానికి అర్చకులు ఆలయ మర్యాదలతో, నమకచమక మంత్రాలతో ఎంతో ఘనంగా పవిత్ర రుద్రాభిషేకం నిర్వహించి, ఆ తర్వాత చాలా చక్కగా అలంకారం చేసి, అన్నప్రసాదాలు మరియు ఇతర నైవేద్యాలు సమర్పించి హారతి ఇస్తారు. ఈ ఉత్సవాన్ని వీక్షించడానికి ఎందరో భక్తులు తండోపతండాలుగా రావడం గమనించవచ్చు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక వైష్ణవ క్షేత్రంలో మహాశివరాత్రిని అధికారికంగా, ఆలయ మర్యాదలతో ఎంతో ఘనంగా జరుపుకోవడం అనేది చాలా అరుదైన విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక పంచ పాండవ తీర్థానికి సంబంధించి, ఒక కధ ప్రాచుర్యంలో వుంది. అది ఇప్పుడు మీకు చెబుతాను.చందమామ కథలు: Chandamama Kathalu - 144 pages |
Advertisement* |
కురుక్షేత్ర సంగ్రామంలో క్షత్రీయులే కాకుండా, ఎంతో మంది బ్రాహ్మణులు కూడా చనిపోవడం జరిగింది. బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడం కోసం పంచ పాండవులు ఈ తీర్థంలో స్నానం ఆచరించి, గోదానం చేయడం జరిగింది.
అయితే దానాన్ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో, సాక్షాత్తూ శ్రీకృష్ణుడే స్వయంగా ఒక వృద్ధబ్రాహ్మణుని రూపంలో వచ్చి గోదానం స్వీకరించినట్లుగా చెబుతారు.
అలాగే శ్రీ వ్యాస ఆశ్రమ వ్యవస్థాపకులైన మలయాళ స్వామి వారు 1914-1926 మధ్యలో ఈ పంచ పాండవ తీర్థంలో 12 ఏళ్ల పాటు తపస్సు చేసి, ఆత్మ సాక్షాత్కారం పొందినట్లుగా కూడా తెలుస్తోంది.
ఇవండీ పంచపాండవ తీర్థంలో వెలసిన క్షేత్ర పాలక శిలకు సంబంధించిన విశేషాలు. ఈసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు, మీరు కూడా తప్పకుండా ఈ క్షేత్ర పాలక శిలను దర్శించండి !!
శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే !! మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!
Comments
Post a Comment