అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఇల్లు చెన్నైలో ఎక్కడ వుందంటే…

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 1952లో ఆమరణ నిరాహార దీక్ష చేసిన సంగతి మనకు తెలిసిన విషయమే. అయితే ఆయన ఈ దీక్షను అప్పటి మద్రాసులో ఎక్కడ చేసారు, అలాగే ఆ ఇల్లు ఇప్పుడు ఎలా వుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి !!
Potti Sriramulu
నెల్లూరు జిల్లాకు చెందిన పొట్టి శ్రీరాములు గారి కుటుంబం 1876లో మద్రాసుకు వలస వెళ్లింది. 1901 మార్చి 16న పొట్టి శ్రీరాములు గారు జన్మించారు. మహాత్మా గాంధీ గారు బోధించిన సత్యము, అహింస మరియు హరిజనోద్ధరణ అనే ఆశయాలను పుణికి పుచ్చుకున్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమాల్లో భాగంగా ఎన్నో సార్లు జైలుకి కూడా వెళ్ళి వచ్చారు.

| అదనపు సమాచారం: శ్రీ రామానుజాచార్యుల వారి జన్మస్థలం & మోక్షస్థలం ఎక్కడ ఉన్నాయో తెలుసా?

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, తెలుగు వాళ్ళు అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే ఉండేవారు. కానీ తెలుగు భాషకు మరియు తెలుగు వారికి సరైన ప్రాధాన్యత ఏమాత్రం ఉండేది కాదు. అందుకని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు, పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబర్ 19న అప్పటి మద్రాసు మాజీ స్పీకర్ అయిన బులుసు సాంబమూర్తి వారికి చెందిన ఇంట్లో నిరాహారదీక్షను ప్రారంభించారు.
Bulusu Sambamurthy
అయితే మొదట్లో ఈ దీక్షను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోలేదు. 58 రోజులు పాటు సాగిన ఈ కఠోర దీక్ష, ఆయన మరణంతో డిసెంబర్ 15న ముగిసింది. పొట్టి రాములు గారి మరణంతో ప్రజలు హింసాత్మక చర్యలకు పూనుకోవడం వల్ల, పరిస్థితి తమ చేయిజారుతోందని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రకటన జారీ చేసింది.

అట్లాస్ పుస్తకం: Oxford Student Atlas for India - 6th Edition, Paperback
Advertisement*

పొట్టి శ్రీరాములు గారు ఎక్కడైతే దీక్ష చేపట్టి అమరజీవి అయినారో అదే ఇంటిని 1956లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసి, ఆయన స్మృతి చిహ్నంగా ఇప్పటికీ కాపాడుతున్నది. అలాగే ఒక మేనేజింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి, 2001లో మూడంతస్తుల భవనాన్ని కూడా నిర్మించడం జరిగింది.
Potti Sriramulu
చెన్నైలోని మైలాపూర్ కపాలీశ్వరస్వామి ఆలయం దగ్గర ఉన్న మెట్రో రైల్వే స్టేషన్ నుండి 500 మీటర్ల దూరంలో పొట్టి శ్రీరాములుగారి స్మారక భవనం ఉంటుంది. ఇది విద్యా మందిర్ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రక్కనే వస్తుంది.
Amarajeevi Potti Sreeramulu Memorial Society
గ్రౌండ్ ప్లోర్లో ఉన్న హాల్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అలాగే ఆనాటి ఫోటోలు, పత్రికల్లో వచ్చిన న్యూస్ ఆర్టికల్ కటింగ్స్ ప్రదర్శనకు పెట్టారు. ఇక రెండవ అంతస్తులో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు జరపుకోవడానికి వీలుగా ఒక మీటింగ్ హాలు, మూడవ అంతస్తులో ప్రాచీన పుస్తకాలతో కూడిన ఒక లైబ్రరీ వుంటుంది.

| అదనపు సమాచారం: చెన్నై శ్రీ కపాలీశ్వర్ ఆలయం: "మైలాపురమే కైలాసం-కైలాసమే మైలాపురం” అని ఎందుకు అంటారు?

ఈసారి మీరు చెన్నై వెళ్ళినప్పుడు, శ్రీ పొట్టి శ్రీరాములుగారి స్మారక భవనాన్ని సందర్శించి ఆయనకు నివాళి అర్పించే ప్రయత్నం చెయ్యండి !! జై హింద్ !!
Amarajeevi Potti Sreeramulu Memorial Society
మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!


Comments