[అరుణాచల రహస్యాలు] పార్వతీ దేవి తపస్సు చేసిన పవళ కుంద్రు కొండపై శ్రీ అర్ధనారీశ్వర ఆలయం

తిరువణ్ణామలై అనగానే మనకు శ్రీ అరుణాచలేశ్వర స్వామివారి ఆలయం, గిరిప్రదక్షిణ మరియు రమణ మహర్షి ఆశ్రమం గుర్తుకొస్తాయి. కానీ, అరుణాచలేశ్వర స్వామివారి ఆలయానికి ఉత్తర దిశలో, ఏ హడావుడీ లేకుండా ప్రశాంతంగా ఉండే ఒక అద్భుతమైన ఆలయం చిన్న కొండపై దాగి ఉంది. అదే  పవళ కుంద్రు శ్రీ అర్ధనారీశ్వర ఆలయం!!

తమిళంలో 'పవళం' అంటే పగడము అని అర్థం. ఈ కొండ రాళ్లు సహజంగానే పగడపు ఎరుపు రంగు ఛాయలను కలిగి ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. 

Pavalakundru Ardha Nariswara Temple

అమ్మవారి తపస్సు మహిమ - అర్ధనారీశ్వర రూపం: ఈ స్థల పురాణం వెనుక చాలా గొప్ప కథ ఉంది. ఒకసారి సరదాగా పార్వతీ దేవి అమ్మవారు వెనకనుంచి వచ్చి పరమశివుని కళ్లను తన చేతులతో మూసేస్తుంది. సర్వలోకాలను కాపాడే ఆ కళ్లు ఒక్కక్షణం మూసుకు పోయేసరికి, విశ్వమంతా గాఢమైన చీకటి అలుముకుంటుంది. 

ఆ పొరపాటుకు ప్రాయశ్చిత్తంగా అమ్మవారు భూలోకానికి వచ్చి, ఈ అరుణాచల క్షేత్రంలోని పవళ కుంద్రు పగడపు కొండపై అత్యంత కఠినమైన తపస్సు ఆచరిస్తుంది. అలా తపస్సు చేసి అరుణాచలేశ్వరునిలో ఐక్యమై, అర్ధభాగాన్ని పొంది అర్ధనారీశ్వరుడుగా ఇక్కడ అవతరించారని ప్రతీతి. 

Pavalakundru Ardha Nariswara Temple

ఈ ఆలయంలో స్వామివారిని 'పవళగిరీశ్వరుడు' లేదా 'అర్ధనారీశ్వరుడు' అని, అమ్మవారిని 'ముత్తాంబికై' అని ఆరాధిస్తారు. పార్వతీ దేవితో పాటు గౌతమ మహర్షి వంటి అనేకమంది సిద్ధులు, యోగులు ఈ కొండపై తపస్సు చేసి మోక్షం పొందారు. 

| అదనపు సమాచారం: అరుణాచల గిరి ప్రదక్షిణ (తిరువణ్ణామలై)

మెయిన్ రోడ్డు నుండి కొంచెం లోపల నెలకొన్న పవళ కుంద్రు మఠానికి దగ్గర ఉన్న మెట్ల మార్గం ద్వారా ఈ గుడికి చేరుకోవచ్చు.

Pavalakundru Ardha Nariswara Temple

రమణ మహర్షి వారి తొలి ఉపదేశం: భగవాన్ శ్రీ రమణ మహర్షికి, ఈ పవళ కుంద్రు అర్ధనారీశ్వర ఆలయానికి ఎంతో విడదీయరాని అనుబంధం ఉంది. 1898వ సంవత్సరంలో రమణులు విరూపాక్ష గుహకు వెళ్లక ముందు ఈ కొండపైనే కొద్దికాలం నివసించారు. కొడుకుని వెతుక్కుంటూ వచ్చిన తల్లి అలగమ్మాళ్ ఇక్కడే రమణులను మొదటిసారి కలిసింది. 

ఈ పవళ కుంద్రు వద్దనే, తల్లి అభ్యర్థన మేరకు రమణ మహర్షి తన జీవితంలో మొట్టమొదటి ఉపదేశాన్ని ఆమెకు ఇలా బోధించారు:

"ప్రారబ్ధాన్ని బట్టి ప్రతీ జీవి రాతను భగవంతుడే నిర్ణయిస్తాడు. జరగకూడనిది ఎంత ప్రయత్నించినా జరగదు, జరగాల్సింది ఎంత ఆపినా ఆగదు. కాబట్టి ప్రశాంతంగా, మౌనంగా ఉండటమే శ్రేయస్కరం!!". 

Pavalakundru Ardha Nariswara Temple

కీ హోల్ దర్శనం: ఉదయం పూజ మరియు సాయంత్రం ప్రదోష సమయాల్లో తప్ప ఇక్కడ పూజారులు ప్రత్యేకంగా రోజంతా ఉండరు. అలాగే ఈ గుడి ఎప్పుడూ మూసే ఉంటుంది. భక్తులు ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకుంటే, అరుణాచల కొండ పాదబాటలో ఉన్న దుర్గా అమ్మవారి ఆలయం దగ్గరకు వెళ్లి, అక్కడ ఉండే పూజారిని కలిసి తాళం చెవి తీసుకుని రావాలి. 

ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms
Advertisement*

పూజారి వచ్చి తలుపు తీస్తేనే స్వామివారిని దర్శించుకోవచ్చు. ఒకవేళ గుడి మూసి ఉంటే నిరాశ చెందాల్సిన పనిలేదు; ఆలయ ప్రధాన ద్వారానికి ఉన్న తాళం చెవి రంధ్రం గుండా లోపల ఉన్న శ్రీ అర్ధనారీశ్వర స్వామిని దర్శించుకుని తరించవచ్చు.

Pavalakundru Ardha Nariswara Temple

ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ పవళ కుంద్రు ఆలయాన్ని శ్రీ రమణాశ్రమం వారు ప్రత్యేక శ్రద్ధతో పునరుద్ధరించి, 7 నవంబర్ 2016 న అత్యంత వైభవంగా మహా కుంభాభిషేకం నిర్వహించారు.

ఈ కొండ పైనుండి చూస్తే అరుణాచలేశ్వర స్వామివారి ఆలయ రాజగోపురాలు మరియు పట్టణ దృశ్యాలు కంటికి ఇంపుగా కనిపిస్తాయి.

Pavalakundru Ardha Nariswara Temple

అరుణాచల క్షేత్రంలో ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆలయం ఒకటి ఉందనే విషయం చాలా మందికి తెలియదు. మీరు ఈసారి తిరువణ్ణామలై వెళ్ళినపప్పుడు తప్పుకుండా పవళ కుంద్రు శ్రీ అర్ధనారీశ్వర ఆలయం సందర్శించే ప్రయత్నం చేయండి. 

ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః !!

| గూగుల్ మ్యాప్ లింక్: పవళ కుంద్రు శ్రీ అర్ధనారీశ్వర ఆలయం

Comments