అరుణాచల గిరిప్రదక్షిణం: అష్ట లింగాలను ఎలా దర్శించుకోవాలి?? పూర్తి వివరాలు మీకోసం...
స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః !!
చిదంబరం వెళ్లి పరమ శివుడిని దర్శనం చేసుకున్నా, తిరువారూర్ లో జన్మించినా, తిరువణ్ణామలైలో వెలసిన అరుణాచలేశ్వరుడిని స్మరించినా, కాశీలో మరణించినా మోక్షం తప్పక లభిస్తుంది.
అతి సులువైన “అరుణాచల” నామమే ఎన్నో కష్టాలను, పాపాలను తొలగిస్తుంది. అదే అరుణాచలం దర్శించినా, గిరి ప్రదక్షిణం చేసినా విశేష ఫలితం కలుగుతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అరుణాచలం...అరుణ అచలం...అంటే ఎర్రని రంగులో ఉన్న పర్వతం. ఈ కొండ స్థూలరూపంలో ఉన్న శివుడిగా పురాణాలు వర్ణిస్తున్నాయి. అందుకే ఈ అరుణాచలానికి ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు శివుడికి ప్రదక్షిణం చేసినట్లే. ఈ కొండని అన్నామలై, అరుణగిరి, అరుణాచలం, అరుణై, సోనగిరి, సోనాచలం అని కూడా పిలుస్తారు.
ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms |
Advertisement* |
పరమశివుని అవతారంగా చెప్పబడే జ్ఞానగురువు శ్రీ దక్షిణామూర్తిస్వామి వారు, ఒక సిద్ధయోగి రూపంలో ఇప్పటకీ ఈ కొండ గుహలలో తపస్సు చేసుకుంటూ ఉంటారని భక్తులు నమ్మకం.
అరుణాచల ప్రవేశం అత్యంత దుర్లభం. ఆ పరమ శివుని అనుగ్రహం లేకుండా ఇది సాధ్యం కాదు. అలాంటి పరమ పవిత్రమైన అరుణాచల క్షేత్రంలో చేసే ప్రదక్షిణం నూరు అశ్వమేధ యాగాలతో సమానం.
తెలుగులో గిరిప్రదక్షిణంగా చెప్పబడే ఈ అరుణాచల పర్వత ప్రదక్షిణాన్ని తమిళంలో గిరివాలం (మలైవాలం) అని, సంస్కృతంలో గిరిపరిక్రమ అని అంటారు. గిరిప్రదక్షిణం ఏరోజైనా చేయవచ్చు. పౌర్ణమి రోజున కానీ, విశేష పర్వదినాల్లో చేసే ప్రదక్షిణం మరింత ఫలితాలను ఇస్తుంది.
గిరి ప్రదక్షిణం అనేది ఎడమ వైపున మాత్రమే చేయాలి. కుడి వైపు మార్గంలో యోగులు, సిద్ధులు, దేవతలు సూక్ష్మ రూపంలో వచ్చి ప్రదక్షిణం చేస్తూ ఉంటారని చెబుతారు.
పాదరక్షలు లేకుండా, నిండు గర్భిణిలా నెమ్మదిగా నడుస్తూ, నిష్కాముకులై, ఆ పర్వతం వైపు చూస్తూ "అరుణాచల శివ! అరుణాచల శివ! అరుణాచల శివ! అరుణాచలా!!" అని జపిస్తూ చేసే ప్రదక్షిణం అత్యంత ఉత్తమమైనది. అలా తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళల్లో గిరిప్రదక్షిణం చేసే భక్తులందరూ ఒక గొప్ప అలౌకిక అనుభూతికి లోనవుతారు.
గిరిప్రదక్షిణం 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అన్ని ఆలయాలను ఎంతో భక్తి భావనతో నెమ్మదిగా చూసుకుంటూ వెళితే, సుమారు 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది.
చాలామంది శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయం బయట కొబ్బరికాయ కొట్టి, కర్పూరం వెలిగించి, వినాయకుడికి నమస్కరించి గిరిప్రదక్షిణం మొదలు పెడతారు. మరికొంతమంది వసతి సౌకర్యం బట్టి రమణాశ్రమం లేదా శేషాద్రి స్వామి ఆశ్రమం నుంచి కూడా మొదలు పెడతారు. గిరిప్రదక్షిణం ఎక్కడ మొదలు పెట్టారో, అక్కడే ముగించాలి !!
ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గంలో అష్టదిక్పాలకులచే ప్రతిష్టింపబడిన అష్టలింగాలను దర్శించుకోవాలి. ఒక్కొక్క అష్టలింగాన్ని దర్శించడం వల్ల ఒక్కొక్క ప్రత్యేక ఫలితం, అనుగ్రహం కలుగుతాయి. ఈ అష్ట లింగాలతో పాటు సూర్య చంద్రులచే ప్రతిష్టించబడిన మరో రెండు లింగాలు కూడా చూడవచ్చు. ఈ పది కలిపి "దశ లింగాలు" అని కూడా వ్యవహరిస్తారు.
ఇక్కడ అన్ని శివాలయాల్లో విభూతి ప్రసాదం ఇస్తారు. మీరు ఈ విభూదిని ఇంటికి తీసుకుని వెళ్లాలనుకుంటే కొన్ని పేపర్ ముక్కలు గానీ, చిన్న ప్లాస్టిక్ డబ్బా గానీ మీతో పాటు ఉంచుకోండి. అలాగే చిల్లర డబ్బులు, పండ్లు లేదా తినుబండారాలు వంటివి జంతువులకు, భిక్షగాళ్లకు, సాధువులకు వితరణ చేయడానికి ఉంచుకోండి.
| గూగుల్ మ్యాప్ లింక్: అరుణాచల గిరిప్రదక్షిణ మార్గంలో దశ లింగాలు
అష్ట లింగాలలో మొదటిది ఇంద్ర లింగం. ఇది తూర్పుదిక్కున ఇంద్రుడుచే ప్రతిష్టించబడినది. ఈ లింగం దర్శించడం వల్ల ఆయు: వృద్ధి కలుగుతుంది. ఇది శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయానికి దగ్గరిలోనున్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ మధ్యన ఉంటుంది.
చాలా రద్దీగా ఉండే షాపుల మధ్యలో ఒక గుడి ఉండడం అనేది నేను మొదటిసారి చూస్తున్నాను. మీరు ఇట్లాంటి ఆలయం ఇంతకు మునుపు ఎక్కడైనా చూసి ఉంటే, ఆ వివరాలను క్రింద కామెంట్ చెయ్యండి !!
రెండవది అగ్ని లింగం. మెయిన్ రోడ్డులో కనిపించే ఆర్చ్ నుండి ఒక యాభై మీటర్లు లోపలకి వెళ్ళాలి. ఇది ఆగ్నేయం దిక్కున అగ్నిదేవునిచే ప్రతిష్టించబడినది. ఈ అగ్ని లింగం దర్శించడం వల్ల సర్వరోగ నివారణ కలుగుతుంది.
ఈ ఒక్క ఆలయం మాత్రం గిరిప్రదక్షిణ మార్గంలో కుడి వైపున ఉంటుంది. మిగతా దశలింగ ఆలయాలు అన్నీ ఎడమవైపున ఉంటాయి. మళ్ళీ మెయిన్ రోడ్డుకు వచ్చి, అలా ముందుకు వెళుతూ ఉంటే, శేషాద్రి స్వామి ఆశ్రమం మరియు రమణాశ్రమం ఒక దాని తర్వాత ఒకటి కనపడతాయి.
అష్ట లింగాలలో మూడవది యమ లింగం. ఇది దక్షిణం దిక్కులో యమధర్మరాజు వారిచే ప్రతిష్టించబడినది. ఈ యమ లింగం దర్శించడం వల్ల అపమృత్యు దోష నివారణ, ఎముకల పుష్టి కలుగుతాయి.
ఈ గిరి ప్రదక్షిణ మార్గం ఇరువైపులా ఉండే పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ దారిలో అక్కడక్కడ కొబ్బరి బొండాలు, చెరుకు రసం, పండ్లు, పూలు, నూనె దీపాలు అమ్మే అంగడిలతో పాటు చిన్న చిన్న బడ్డీ కొట్లు, టిఫిన్ సెంటర్లు, పెద్ద పెద్ద షాపులు కూడా ఉంటాయి. మీ అవసరానికి తగినట్లు ఏమైనా కొనుక్కోవాలంటే చాలా వరకు అన్నీ దొరుకుతాయి.
అలాగే అక్కడక్కడ కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు మరియు ఆశ్రమాలు ఎంతో ఉదార స్వభావంతో సాంబారు అన్నం, పెరుగు అన్నం వంటివి గిరి ప్రదక్షిణ భక్తులకు వితరణ చెయ్యడం కూడా చూడవచ్చు.
అలా ముందుకు వెళుతూ ఉంటే ఒక వై-జంక్షన్ (Y-Junction) వస్తుంది. ఎడమ వైపు రోడ్డు "చెంగాం" అనే వూరుకు వెళ్ళే మంగుళూర-విల్లుపురం హైవేకు కలుస్తుంది. కాబట్టి కుడి ప్రక్కగా వెళుతూ ఉండండి.
పూజలు లేదా శుభకార్యములకు తప్పనిసరి: Rameshwaram Fabrics Exquisite Silk Pattu Panchalu - 4m Dhoti, 2m Dupatta |
Advertisement* |
ఈ గిరిప్రదక్షిణ మార్గంలోనే అరుణాచల పర్వతాన్ని ఎంతో భక్తి భావనతో తదేకంగా చూస్తునట్లుగా ఉండే అష్ట నంది విగ్రహాలు కనపడతాయి. కొంతమంది భక్తులు ఈ నందీశ్వర స్వామికి బొట్లు పెట్టి, దీపం వెలిగించి, అరటిపండ్లతో నైవైద్యం పెట్టి, పూలు వస్త్రాలతో అలంకరించి నమస్కారం చేసుకుంటారు.
ఇక నాలుగవదైన నైరుతి లింగం నైరుతి దిక్కులో నిరుతిచే ప్రతిష్టించబడినది. ఈ నైరుతి లింగం దర్శించడం వల్ల ఆరోగ్యం, ధనం, సంతానప్రాప్తి కలుగుతాయి.
ఒకప్పుడు కావ్యకంఠ గణపతి ముని ఇక్కడే ధ్యానంలో గడిపేవారని చెబుతారు. అందుకే చాలా మంది భక్తులు ఇక్కడ ధ్యానం చేస్తూ ఉండడం గమనించవచ్చు.
దశ లింగాలలో ఒకటైన సూర్య లింగాన్ని సూర్య దేవుడు ప్రతిష్టించాడు. సాక్షాత్తూ శివ స్వరూపం అయిన అరుణాచల శిఖరం పైనుండి ప్రయాణించిన కారణంగా సూర్య భగవానుడు తన తేజస్సును కోల్పోవడం జరుగుతుంది. తిరిగి తన శక్తిని పొందడానికి సూర్య దేవుడు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టించి పూజించడం జరిగింది.
అందుకే అనారోగ్య సమస్యల నుండి విముక్తి కొరకు ఇక్కడ ఆదిత్య హృదయం, ద్వాదశ ఆదిత్య స్తుతి వంటివి పఠిస్తే తప్పుకుండా ఫలితం ఉంటుందని చెబుతారు.
| అదనపు సమాచారం: కుంభకోణం సమీపంలో ఉన్న సూర్యనార్ కోవిల్ ప్రత్యేకత ఏమిటో తెలుసా?
అష్ట లింగాలలో ఐదవది వరుణ లింగం. వరుణుడు ఈ లింగాన్ని పడమర దిక్కులో ప్రతిష్టించాడు. ఈ వరుణ లింగాన్ని దర్శించిన వారికి పాప విముక్తి కలుగుతుంది.
అలాగే పడమర దిక్కుకు గ్రహాధిపతి శనీశ్వర భగవాన్. అందువల్ల శని ప్రభావం నుండి ఉపశమనం పొందాలంటే వరుణ లింగాన్ని దర్శించి తీరాల్సిందే !!
| అదనపు సమాచారం: శని ప్రభావం చాలా తీవ్రంగా ఉందా?? అయితే తిరునల్లార్ శ్రీ శనీశ్వర భగవాన్ ఆలయం తప్పకుండా దర్శించండి !!
అష్ట లింగాలలో ఆరవది వాయు లింగం. వాయుదేవుడు ఈ లింగాన్ని వాయువ్య దిక్కున ప్రతిష్ఠించాడు. హృదయ, శ్వాస, జీర్ణాశయ వ్యాధుల నుండి ఉపశమనం పొందాలని అనుకునేవారు ఈ వాయు లింగాన్ని తప్పక దర్శించాలి.
వాయుదేవుడి ప్రభావం వల్లనో ఏమో ఈ ఆలయంలో ఎల్లప్పుడూ సమృద్ధిగా గాలి వీస్తూ ఉండడం గమనించవచ్చు. అలాగే గుడిలో దీపం కూడా రెప రెప లాడుతూ ఉంటుంది.
అలా ముందుకు వెళుతూ ఉంటే ఇంకొక వై-జంక్షన్ (Y-Junction) వస్తుంది. ఎడమ వైపు దారి కాంచీపురం హైవేకు కలుస్తుంది, కాబట్టి కుడి ప్రక్కగా వెళుతూ ఉండండి. కొంత దూరంలో దశ లింగాలలో మరొకటైన చంద్ర లింగం చేరుకుంటారు.
చంద్ర లింగాన్ని చంద్రుడు ప్రతిష్టించాడు. మానసిక అశాంతి, చర్మ వ్యాధులు, సంతానలేమి సమస్యల నుండి విముక్తి కొరకు ఈ చంద్ర లింగాన్ని దర్శించాలి.
ఇక ఏడవది కుబేర లింగం. ఉత్తర దిక్కులో కుబేరుడుచే ప్రతిష్టించబడినది. ఈ కుబేర లింగం దర్శించడం వల్ల ఐశ్వర్యం, అభివృద్ధి కలుగుతాయి.
ఈ కుబేర లింగానికి కరెన్సీ నోట్లతో, చిల్లర నాణేలతో కూడా అభిషేకం జరుపుతారని అంటారు. అందుకే చాలా మంది తమ శక్తికి తగినట్లుగా చిల్లర నాణేలను ఇక్కడ సమర్పించడం జరుగుతుంది.
మిగతా ఆలయాల్లో కన్నా ఇక్కడ కొంచెం రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలో క్యూ లైనుకు ఇరుప్రక్కలా చిన్నచిన్న అరుగులు లాంటివి ఉంటాయి. గిరిప్రదక్షిణ చేసే భక్తులు కాసేపు వాటిపై కూర్చుని సేద తీరుతూ ఉండడం ఇక్కడ చూడవచ్చు.
అలా ముందుకు సాగుతూ ఉంటే మరొక వై-జంక్షన్ (Y-Junction) వస్తుంది. ఈ ఒక్కసారి మాత్రం కుడి వైపు కాకుండా, ఎడమ ప్రక్కగా వెళుతూ ఉండండి. ఈ దారిలో శ్మశాన వాటిక, యాత్రి నివాస్ వంటివి తప్ప మరేవి కనిపించవు, అయినా మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు.
కొంచెం దూరంలో ఈశాన్య లింగం చేరుకుంటారు. అష్ట లింగాలలో చివరిదైన ఈశాన్య లింగం ఈశాన్యుడుచే ప్రతిష్టించబడినది. ఈశాన్య లింగాన్ని దర్శించడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
అలా అరుణాచల క్షేత్రంలో గిరిప్రదక్షిణం పూర్తిచేసిన భక్తులు విజయోత్సవంతో చివరికి శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయం దగ్గరికి చేరుతారు. మరొకసారి కర్పూరం వెలిగిస్తూ, తమ పాపాలు ఈతిబాధలను తొలగించమని "అన్నామలైక్కు హరోం హర" అంటూ తమిళంలో ఎలుగెత్తి ఆ పరమశివుడిని భక్తితో వేడుకుంటున్న దృశ్యం చాలా సర్వసాధారణం.
శ్రీ చాగంటి గురువు గారు ఒక ప్రవచనంలో ఇలా అంటారు... ప్రతి మనిషి యొక్క జీవుడియాత్ర అనే పుస్తకంలో అరుణాచల దర్శనానికి ముందు, ఆ తర్వాత అని విభజిస్తూ ఎర్ర సిరాతో నిలువుగా ఒక గీత గీయబడి ఉంటుంది.
అది అతిశయోక్తి కానే కాదు. సర్వ జగత్తులను కాపాడే ఆ పరమశివుడిపై సంపూర్ణ భక్తి శ్రద్ధలతో, అచంచల విశ్వాసంతో అరుణాచల గిరిప్రదక్షిణ యాత్ర పూర్తి చేసిన తర్వాత అది నిజమే అని ఖచ్చితంగా అనిపిస్తుంది !!
మీరు శ్రీ అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత, అలాగే గిరిప్రదక్షిణ యాత్ర పూర్తిచేసుకున్న తర్వాత నిజంగా ఏమనిపించింది? ఆ వివరాలను క్రింద కామెంట్ చెయ్యండి. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః !!
గృహ ప్రవేశానికి బహుమతి: Hindcraft Home Decor Items – Laughing Buddha Statue - 5 Inches |
Advertisement* |
మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!
Comments
Post a Comment