నగర కోలాహలంలో ఒక ప్రశాంత దివ్య ధామం: ఇస్కాన్ NVCC పూణే ఆలయం

మహారాష్ట్ర అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది షిరిడీ సాయిబాబా ఆలయం, శని శింగణాపూర్, త్రయంబకేశ్వర్ లేదా కొల్హాపూర్ మహాలక్ష్మి క్షేత్రాలు. కానీ ఐటీ కంపెనీలతో, ప్రముఖ విద్యా సంస్థలతో నిత్యం రద్దీగా ఉండే పూణే నగరంలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. 

అదే కాట్రాజ్-కొంధ్వా (Katraj-Kondhwa) బైపాస్ రోడ్డులో వెలసిన ISKCON NVCC మందిరం.

ISKCON అంటే International Society for Krishna Consciousness మరియు NVCC  అంటే New Vedic Cultural Center. నగరంలోని వాహనాల శబ్దాలు, రోజూవారీ హడావుడి నుంచి ఒక్కసారి ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే, ఏదో తెలియని ప్రశాంతత మనసును ఆవరిస్తుంది. 

ఆధ్యాత్మిక వాతావరణం, కంటికి ఇంపైన పచ్చదనం, మధురమైన హరినామ సంకీర్తనలు... వీటన్నింటి సమాహారమే పుణేలోని ఇస్కాన్ NVCC మందిరం !!

ISKCON NVCC Pune

సాధారణంగా ఇస్కాన్ ఆలయం అంటేనే పరిశుభ్రత, క్రమశిక్షణ, ఆధ్యాత్మికతకు మారు పేరు. అయితే 2013 లో ప్రారంభమైన ఈ పుణే ఇస్కాన్ NVCC మందిరం ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఒక ఆలయం మాత్రమే కాదు, మన ప్రాచీన వేద సంస్కృతిని, వైదిక జీవనశైలిని, మానవీయ విలువలను భక్తులకు దగ్గర చేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కేంద్రం.

ఆలయ ముఖద్వారం గుండా లోపలికి వెళ్లగానే ముందుగా మనల్ని పలకరించేది- కనువిందు చేసే విశాలమైన పచ్చని లాన్లు, తులసి వనం, ఎత్తైన చెట్లు. కాంక్రీట్ అడవి లాంటి నగరంలో ఈ పచ్చదనం కళ్లకు ఎంతో హాయినిస్తుంది. 

| అదనపు సమాచారం: పూణే నగరంలో J. M. Road ఎందుకు అంత ఫేమస్??

ఈ క్షేత్రంలో ఆధ్యాత్మికతతో పాటు జీవకారుణ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఆలయ ప్రాంగణంలోనే ఎంతో శుభ్రంగా నిర్వహించబడుతున్న ఒక చిన్న గోశాల ఉంది. ఇక్కడ మన దేశవాళీ ఆవులను పవిత్రంగా పూజిస్తూ సంరక్షిస్తున్నారు. భక్తులు స్వయంగా గోవులకు గ్రాసం తినిపించే వెసులుబాటు కూడా ఉంది.

ISKCON NVCC Pune

ఇక ఆలయ ఆవరణలో ముందుకు నడుస్తుంటే మధ్యలో ఒక వాటర్ ఫౌంటెన్ పైన కాళీయ నాగుడి పడగలపై నాట్యం చేస్తున్న శ్రీకృష్ణుడి కాళీయ మర్దన విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆ విగ్రహాన్ని చూస్తున్నప్పుడు చిన్ననాటి కృష్ణుడి లీలలు మన కళ్లముందు మెదులుతాయి. 

ముఖ్యంగా పిల్లలు ఈ విగ్రహాన్ని చూసి ఎంతో సంబరపడతారు. అలాగే ఇది అందరికీ ఒక మంచి ఫోటో స్పాట్ కూడా!!

ప్రధాన ఆలయ మండపంలోకి ప్రవేశించగానే అక్కడి సీలింగ్ పైన మరియు గోడలపై చెక్కిన అద్భుతమైన చిత్రాలు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. శ్రీకృష్ణుడి జననం, బాల్య లీలలు, గోవర్ధన గిరిని ఎత్తడం, మరియు రాసలీలల దృశ్యాలను ఎంతో కళాత్మకంగా గోడలపై చెక్కారు.

ISKCON NVCC Pune

ఇక్కడ ఉన్న ప్రధాన ఆలయంలో ముగ్గురు దివ్య మూర్తులు కొలువుదీరి ఉన్నారు. మధ్యలో శ్రీ శ్రీ రాధా బృందావనచంద్ర స్వామివార్లు, ఒకవైపు శ్రీ శ్రీ గౌర నితాయ్ (చైతన్య మహాప్రభు-నిత్యానంద ప్రభు), మరొక వైపు శ్రీ శ్రీ జగన్నాథ-బలదేవ-సుభద్ర దర్శనమిస్తారు. 

ప్రతిరోజూ ఉదయం 4:30 కి మంగళ హారతి, సాయంత్రం 7:00 కి సంధ్యా హారతి సమయంలో భక్తులు హరే కృష్ణ నామసంకీర్తనలు పాడుతూ, నృత్యం చేస్తూ మైమరిచిపోవడం ఇక్కడ నిత్యం కనిపించే ఒక సుందర దృశ్యం.

ISKCON NVCC Pune

దీనితో పాటు, ఈ ప్రాంగణం వెనుక భాగంలో ఒక చిన్న మెట్టపైన దక్షిణ భారతీయ శైలిలో రాతితో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి (బాలాజీ) వారి ఆలయం ఉంటుంది. నల్ల రాతి శిల్పకళ, రాతి స్తంభాలు, ఎత్తైన గోపురం చూస్తుంటే మనం సాక్షాత్తు తిరుమల కొండపైనే ఉన్నామేమో అనే భావన కలుగుతుంది. 

ISKCON NVCC Pune

తిరుపతికి వెళ్లలేని భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. అంతేకాదు, ఇక్కడ భక్తులకు తిరుమల తరహాలోనే కమ్మని లడ్డూ ప్రసాదాన్ని కూడా అందజేస్తారు.

ISKCON NVCC Pune

ఇక ఈ ఆలయ ప్రత్యేకతల్లో అత్యంత ముఖ్యమైనది ఉచిత నిత్యాన్నదానం. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి పవిత్రమైన మహా ప్రసాదాన్ని వడ్డిస్తారు. ఆలయం ప్రాంగణం వెలుపల రుచికరమైన శాఖాహార వంటకాలు లభించే "గోవిందాస్" రెస్టారెంట్ మరియు ఫంక్షన్ హాల్ ఉన్నాయి. 

సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు, యాత్రికుల బస కోసం ఆలయ ప్రాంగణంలోనే అతిథి భవన్ ఉన్నది. అలాగే ఆలయ ప్రాంగణంలోనే ఆధ్యాత్మిక పుస్తకాలు లభించే షాప్, భగవద్గీత అధ్యయన కేంద్రం కూడా ఉన్నాయి.

ISKCON NVCC Pune

ఈ ఆలయం ఉదయం 4:30 నుండి మధ్యాహ్నం 1:00 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి రాత్రి 8:45 వరకు తెరిచి ఉంటుంది. అక్టోబర్ నుండి మార్చి నెలల మధ్య పూణే వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. 

శ్రీరామ నవమి, జన్మాష్టమి, రాధాష్టమి, గోవర్ధన పూజ, గీతా జయంతి పండుగల రోజుల్లో ఈ ఆలయం ప్రత్యేక పూజలతో, విద్యుత్ దీపాల వెలుగులతో, భక్తుల సందడితో మరింత కళకళలాడుతుంది.

| గూగుల్ మ్యాప్ లింక్: ఇస్కాన్ NVCC పూణే ఆలయం

Comments