పూజా నిర్మాల్యం లేదా బిల్వ దళాలను కాళ్ళతో తొక్కిన దోషం ఎలా పోతుందో తెలుసా ?!
మహేశాన్నాపరో దేవో మహిమ్నో నాపరా స్తుతిః
మహేశ్వరుడుని మించిన దేవుడు లేదు, శివమహిమ్న స్తోత్రాన్ని మించిన స్తుతి వేరొకటి లేదు. ఇది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే నేనొక కథ చెప్పాలి.
ఒకానొక కాలంలో పుష్పదంతుడు అనే గంధర్వుడు వుండేవాడు. ఇతను ఒక గొప్ప శివ భక్తుడు మరియు మంచి సంగీత విద్వాంసుడు. అలాగే, ఎవరికీ కనపడకుండా అదృశ్య రూపంలో తిరిగే శక్తిని కలిగి ఉన్నాడు.
ఒక రోజు పుష్పదంతుడు నానావిధ పరిమళ పుష్పాలతో కూడిన ఒక చక్కటి ఉద్యానవనాన్ని చూసి ఎంతో పరవశించి పోతాడు. అదృశ్య రూపంలో తిరిగే గుణం కలిగి ఉండడం వల్ల, ప్రతీ రోజూ వచ్చి ఆ తోటలో ఉన్న మంచి మంచి పూలు కోసుకొనిపోవడం జరిగేది.
ఈ తోట చిత్ర రధుడు అనే రాజు గారికి చెందినది. ఎంతో పకడ్బందీగా పహరా కాస్తున్నా, తోటలోని పూలు ఎలా మాయమైపోతున్నాయో రాజుగారి భటులకు అర్థం అయ్యేది కాదు. ఈ సమస్యకు ఉపాయంగా, చిత్ర రధుడు పూల చెట్ల క్రిందన మారేడు దళాలను వెదజల్లమని భటులకు ఆజ్ఞాపిస్తాడు.
లివింగ్ రూమ్ లేదా ఆఫీసులో అలంకరణకు: Behoma Metal Hammered Vase |
Advertisement* |
ఎప్పటిలాగే, పుష్పదంతుడు అదృశ్య రూపంలో వచ్చి మర్నాడు పూలు కోయడం జరుగుతుంది. అలా కోయడంలో తనకు తెలియకుండా మారేడు దళాలను కాళ్ళతో తొక్కుతాడు. పరమ పవిత్రమైన మరియు తనకు ఎంతో ఇష్టమైన మారేడు దళాలను తొక్కటం వల్ల శివుడుకి కోపం వచ్చి పుష్పదంతుడి యొక్క దివ్య శక్తులను నశింపజేస్తాడు.
అదృశ్య రూపం కోల్పోయిన పుష్పదంతుడిని భటులు వెంటనే బంధించి, చిత్ర రధుడు వద్దకు తీసుకుపోగా, పూలు దొంగతనం చేసిన నేరానికి కారాగార శిక్షను విధిస్తాడు.
కారాగార వాసంలో తన తప్పును తెలుసుకున్న పుష్పదంతుడు, శివుడి అనుగ్రహం తిరిగి పొందడానికి ఆయన మహిమలను గొప్పగా వర్ణిస్తూ చాలా సరళమైన భాషలో “శివ మహిమ్నః” అనే స్తోత్రాన్ని రాస్తాడు. అతని భక్తికి మెచ్చిన పరమ శివుడు పుష్పదంతుడికి తిరిగి దివ్య శక్తులను రప్పిస్తాడు. కారాగారం నుండి బయట పడిన పుష్పదంతుడు చిత్ర రధుడు వద్దకు పోయి, తాను చేసిన అపరాధాన్ని మన్నించమని ప్రాధేయపడతాడు. దయా గుణం కలిగిన చిత్ర రధుడు పుష్పదంతుడిని విడిచి పెడతాడు.
అప్పుడు ఆనందంతో పుష్పదంతుడు తన గ౦ధర్వ లోకానికి వెళ్ళిపోతాడు, కానీ అతను రచించిన “శివ మహిమ్నః” స్తోత్రం మాత్రం మన వద్దనే ఉండి, సమస్త మానవాళికి పుణ్యాన్ని కలుగజేస్తోంది.
| శివ మహిమ్నః స్తోత్రం లింక్: శ్రీ పుష్పదంత విరచితం శ్రీ శివమహిమ్న స్తోత్రం
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, కొన్ని నెలల క్రితం నేను వారణాసి వెళ్ళడం జరిగింది. శ్రీ పుష్ప దంతేశ్వర మహదేవుని ఆలయ దర్శనం చేసుకున్నా లేదా శివ మహిమ్నః స్తోత్రాన్ని ఎంతో భక్తిగా పఠించినా శివ నిర్మాల్యం తొక్కిన దోషం తొలగిపోతుంది అనే విషయం తెలుసుకున్నాను.
కాశీ నుండి తిరిగి వస్తున్న చివరి నిముషంలో, అక్కడ ఎంతో ప్రయత్నం చేసిన తర్వాత శ్రీ పుష్ప దంతేశ్వర మహదేవ్ ఆలయాన్ని కనుగొని సందర్శించడం జరిగింది. ఈ ఆలయం గోడ మీద తెల్లటి పాలరాయిపై నల్లటి అక్షరాలతో చెక్కిన శివ మహిమ్నః స్తోత్రం చూడవచ్చు. ఆలయం మూసి వేయబడినా కూడా, కిటికీ తలుపు నుండి ఆయన దర్శన భాగ్యం ఎంతో చక్కగా కలిగింది.
| గూగుల్ మ్యాప్ లింక్: శ్రీ పుష్ప దంతేశ్వర మహదేవ్ ఆలయం
శ్రీ పుష్ప దంతేశ్వర స్వామి వారి ఆలయాన్ని వారణాసిలో కాకుండా మీరు వేరెక్కడైనా చూసి ఉన్నట్లయితే వాటి వివరాలను క్రింద నున్న కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు. అలాగే నాకు తెలిసింతవరకు, శివ మహిమ్నః స్తోత్రాన్ని మన వైపుకన్నా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా చదువుతారని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి.
ఓం నమః శివాయ !!
Nice explanation
ReplyDeleteధన్యవాదములు !!
Delete