వారణాసిలో అద్భుతం: నీటిలో మునిగి, 9 డిగ్రీలు ఒరిగి ఉండే శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం !!

వారణాసి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పవిత్రమైన గంగానది, పురాతనమైన ఘాట్‌లు, గంగా హారతి, మరియు అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం. కానీ, ఈ పవిత్ర కాశీ నగరంలో ఒక అంతుచిక్కని వాస్తుశిల్ప అద్భుతం ఉందని మీకు తెలుసా? అదే మణికర్ణికా ఘాట్ సమీపంలో ఉండే శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం.  

ఇటలీలోని పీసా టవర్ గురించి ప్రపంచమంతా గొప్పగా మాట్లాడుకుంటుంది. కానీ, అంతకంటే ఎక్కువగా వంగి ఉండి, శతాబ్దాలుగా గంగానది ప్రవాహాన్ని తట్టుకుని నిలబడిన మన కాశీలోని ఈ అద్భుతమైన శివాలయం గురించి చాలా మందికి తెలియదు. 

ఈ రోజు మన బ్లాగ్‌లో శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలను తెలుసుకుందాం ! !

Ratneshwar Mahadev Temple Varanasi

గంగా నది ఒడ్డున ఉండే మణికర్ణికా ఘాట్ లో ఈ ఆలయం సుమారు 9 డిగ్రీల కోణంలో ఒకవైపుకు వంగి ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పీసా టవర్ కేవలం 4 డిగ్రీలు మాత్రమే వంగి ఉంటే, ఈ ఆలయం అంతకు రెట్టింపు వంగి ఉండటం విశేషం. అందుకే స్థానికులు దీనిని 'కాశీ కర్వత్' (వంగి ఉన్న కాశీ ఆలయం) అని కూడా పిలుస్తారు. 

సాధారణంగా కాశీలోని ఆలయాలన్నీ వరదల నుండి రక్షణ కోసం ఎత్తైన ప్రదేశాలలో నిర్మిస్తారు. కానీ, ఈ ఆలయం గంగానది నీటి మట్టానికి చాలా దిగువన నిర్మించబడింది. దీని వల్ల సంవత్సరంలో చాలా నెలల పాటు ఈ ఆలయ గర్భగుడి నీటిలోనే మునిగి ఉంటుంది. 

ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms
Advertisement*

19వ శతాబ్దంలో బ్రిటిష్ సర్వేయర్ జేమ్స్ ప్రిన్సెప్ తన రికార్డులలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని రాశారు. ఆలయం నీటిలో మునిగి ఉన్నప్పుడు, అప్పటి పూజారులు గర్భగుడిలోకి వెళ్లడానికి ఏకంగా నీటిలోకి మునిగి స్వామివారికి నిత్య పూజలు నిర్వహించేవారట. కేవలం వేసవి కాలంలో నీటి మట్టం బాగా తగ్గినప్పుడు మాత్రమే భక్తులకు గర్భగుడి దర్శనభాగ్యం కలుగుతుంది. మిగతా సమయాల్లో ఆలయ గోపురం మాత్రమే మనకు కనిపిస్తుంది. 

Ratneshwar Mahadev Temple Varanasi

చరిత్ర ప్రకారం 19వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారని రికార్డులు చెబుతున్నప్పటికీ, దీని వెనుక ఆసక్తికరమైన రెండు పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి: 

  • తల్లి శాపం: సుమారు 500 సంవత్సరాల క్రితం రాజా మాన్ సింగ్ దగ్గర పనిచేసే ఒక సేవకుడు తన తల్లి 'రత్నా బాయి' కోసం ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆలయ నిర్మాణం పూర్తయ్యాక, తన తల్లి రుణం తీర్చుకున్నానని అతను గర్వంగా ప్రకటించాడట. దానికి కోపగించిన అతని తల్లి, "మాతృ ఋణాన్ని ఎవరూ ఎన్ని జన్మలైనా తీర్చుకోలేరు" అని శపించిందట. ఆ శాపం వల్లే నిర్మాణం పూర్తయిన కొద్ది కాలానికే ఈ ఆలయం ఇలా వంగిపోయిందని ఒక నమ్మకం. అందుకే ఈ ఆలయాన్ని 'మాతృ ఋణ్ మహాదేవ్'  అని కూడా అంటారు. 
  • అహల్యాబాయి హోల్కర్ కోపం: మరొక కథ ప్రకారం, ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్ దగ్గర పనిచేసే 'రత్నా బాయి' అనే సేవకురాలు దీనిని నిర్మించి, మహారాణి పేరు కాకుండా తన పేరు పెట్టుకుందట. దీనికి కోపగించిన అహల్యాబాయి ఈ ఆలయం వంగిపోవాలని శపించిందని అంటారు. 

స్థానిక కథలు ఎలా ఉన్నప్పటికీ, బ్రిటిష్ పన్నుల రికార్డుల ప్రకారం ఈ ఆలయం 1825 నుండి 1830 మధ్య కాలంలో నిర్మించబడి ఉండవచ్చని తెలుస్తోంది. 1857లో అమేథీ రాజకుటుంబం దీనిని నిర్మించిందని చెబుతారు. 

Ratneshwar Mahadev Temple Varanasi

ఈ ఆలయం ఇంత దిగువన నిర్మించడం వలన స్వామివారికి నిరంతరం గంగాజలంతో అభిషేకం జరుగుతుందనే ఆధ్యాత్మిక కారణం కూడా ఉండి ఉండొచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే నది ప్రవాహానికి పునాదుల కింద మట్టి కోతకు గురికావడం వల్లే కాలక్రమేణా ఇలా 9 డిగ్రీలు వంగిపోయిందని మరో కోణంలో నిపుణులు మరియు శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. 

| అదనపు సమాచారం: పూజా నిర్మాల్యం లేదా బిల్వ దళాలను కాళ్ళతో తొక్కిన దోషం ఎలా పోతుందో తెలుసా ?!

సంప్రదాయబద్ధమైన నాగర మరియు ఫంసానా శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ గోపురంపై చెక్కిన అద్భుతమైన శిల్పకళ నాటి కళాకారుల నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఆలయం 9 డిగ్రీలు వంగి ఉన్నప్పటికీ, నేటికీ ఎంతో దృఢంగా నిలబడి ఉంది. 2015లో భారీ పిడుగు పడినప్పటికీ కేవలం శిఖరానికి చిన్నపాటి నష్టం మాత్రమే జరిగింది కానీ, ఆలయ మూల నిర్మాణానికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. 

Ratneshwar Mahadev Temple Varanasi

నిరంతరం నీటిలో నానుతూ, ఎన్నో ప్రకృతి విపత్తులను తట్టుకుని నిలబడటం నిజంగా ఒక అద్భుతం, అలాగే నాటి శిల్పుల నైపుణ్యానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. శీతాకాలంలో అంటే నవంబర్ – మార్చి నెలల్లో, గంగా నది నీటి మట్టం కొంత తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో ఆలయాన్ని సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. 

మీరు ఎప్పుడైనా వారణాసికి వెళ్తే, ఈ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని చూడటం మాత్రం మర్చిపోకండి. మన దేశంలో ఇలాంటి అద్భుతాలు మరెన్నో ఉన్నాయి. ఈ ఆలయం గురించిన ఈ ఆసక్తికరమైన సమాచారం మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో వ్రాయండి !!

| గూగుల్ మ్యాప్ లింక్: వారణాసి శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం

Comments