మహానది చిత్రంలోని “శ్రీ రంగ రంగనాథుని" పాటలో చూపించిన ఆలయం ఎక్కడిది?

కమలహాసన్ నటించిన మహానది చిత్రంలో “శ్రీ రంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే...” అనే పాట మీలో ఎంతమందికి ఇష్టం? అలాగే ఆ పాటలో చూపించిన పురాతన దేవాలయం ఎక్కడిది అనే కుతూహలం మీలో ఎంతమందికి కలిగింది? 

నేను మహానది సినిమాను 1994 లో మా వూరైన అమలాపురంలో చూడడం జరిగింది. వృత్తి రీత్యా నేను 1999 లో తమిళనాడుకు రావడం జరిగింది. కానీ ఈ ఆలయం ఎక్కడ వున్నది అనేది ఒక సంవత్సరం క్రితమే తెలిసింది. అంటే దాదాపు పాతిక సంవత్సరాలు పైనే పట్టింది. అలాగే అనుకోకుండా ఈ ఆలయాన్ని ఈ మధ్యనే దర్శించడం కూడా జరిగింది. 

Tribhuvanam Kampahareswara Temple

ఈ పాటలో శ్రీ రంగనాథుని గురించి వర్ణిస్తూ ఉంటే, మనం ఈ ఆలయం విష్ణువుకి సంబంధించినది అని అనుకుంటే చాలా పొరపాటే. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా మయిలాడుదురై-కుంభకోణం నడుమున ఉన్న “త్రిభువనం” అనే ఊరిలో ఉంది. ఇది మహా శివునికి సంబంధించిన ఆలయం!!

ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms
Advertisement*

త్రిభువనం ఆలయంలో ప్రధాన దైవం- శ్రీ కంపాహరేశ్వర స్వామి. స్థల పురాణం ప్రకారం, ఒక రాజు పొరపాటున ఒక బ్రాహ్మణుడిని చంపడం వల్ల, దుష్టశక్తుల పీడితుడైన ఆ రాజు యొక్క కంపాన్ని శివుడు తొలగించాడని నమ్ముతారు. దీనివలన ఇక్కడ నెలకొన్న శివునికి కంపాహరేశ్వర స్వామి అనే పేరు వచ్చింది.

Tribhuvanam Kampahareswara Temple

ఈ ఆలయాన్ని మూడవ కులోత్తుంగ చోళుడు 1176 సంవత్సరంలో నిర్మించాడని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇది మధ్యయుగ కాలంలో నిర్మించిన నాలుగు కళాఖండాలలో చివరిదిగా చెబుతారు. తంజావూరు బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం ఆలయం, కుంభకోణం ఐరావతేశ్వర ఆలయాల వరుసలో ఒకటిగా పరిగణించబడుతుంది.  

| అదనపు సమాచారం: కుంభకోణంలో నవగ్రహ ఆలయం: సూర్యనార్ కోవిల్

Thirubuvanam Kampaheswarar Temple

మరో పురాణం ప్రకారం, విష్ణువు యొక్క అవతారమైన నరసింహుడి ఆగ్రహాన్ని చల్లార్చడానికి శివుడు కంపాహరేశ్వర రూపాన్ని ధరించాడని నమ్ముతారు. అందుకే ఈ ఆలయం ప్రాంగణంలో శ్రీ శరభేశ్వర ఉపాలయం కూడా ఉంటుంది. శరభేశ్వర స్వామి రూపం చాలా విభిన్నంగా ఉంటుంది. సింహం శరీరం, ముఖం, ఆరు కాళ్లు మరియు తోకతో ఉన్న శరభేశ్వర స్వామికి నాలుగు చేతుల్లో గొడ్డలి, జింక, పాము, అగ్ని ఉంటాయి. శరభేశ్వర స్వామి పాదాల క్రిందన నరసింహ స్వామి నలుగుతూ, పోరాడుతున్నట్లుగా ఉండడం స్పష్టంగా చూడవచ్చు. 

Thirubuvanam Kampaheswarar Temple

ఓం శరభేశ్వరాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో శరభః ప్రచోదయాత్ !!

| గూగుల్ మ్యాప్ లింక్: త్రిభువనం శ్రీ కంపాహరేశ్వర స్వామి ఆలయం

Comments