మహా కుంభమేళా 2025: ప్రయాగరాజ్ లో ఒక రోజు ట్రిప్ ...
ఒకప్పుడు అలహాబాద్ లేదా ఇలాహాబాద్ గా పిలవబడిన ప్రయాగరాజ్ పట్టణంలో 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది.
పరమ పవిత్రమైన గంగ, యమున మరియు సరస్వతి నదుల సంగమ ప్రాంతమైన ప్రయాగరాజ్ లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు, అంటే 45 రోజుల పాటు మహా కుంభమేళా జరగనున్నది. సుమారు 40 కోట్ల మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ప్రయాగరాజ్ లో జరిగే మహా కుంభమేళాకు తరలి వెళ్తున్నారు.
ప్రయాగరాజ్ లో మొత్తం నాలుగు రైల్వే స్టేషన్లు ఉంటాయి, వాటిలో రెండు ముఖ్యమైనవి. ఒకటి ప్రయాగరాజ్ సంగం స్టేషన్; ఇది త్రివేణి సంగమ ప్రాంతానికి మరియు ఇతర సందర్శన ప్రదేశాలకు దగ్గరగా ఉంటుంది. మరొకటి ప్రయాగరాజ్ జంక్షన్; ఇది సిటీ వైపున ఉంటుంది కాబట్టి చాలా రైళ్లు ఎక్కువగా ఈ స్టేషన్ లోనే ఆగుతాయి.
సులువైన ప్రయాణానికి నేస్తం: American Tourister FORNAX - Luggage Soft - TSA Lock, Telescopic Trolly, 8 Wheels, Garment Suiter, Laundry & Shoe Bags |
Advertisement* |
సుసంపన్నమైన ఆధ్యాత్మిక వారసత్వం మరియు చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రయాగరాజ్ లో తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలను, అలాగే వాటి యొక్క విశేషాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.
| గూగుల్ మ్యాప్ లింక్: ప్రయాగరాజ్ లో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు
1. శ్రీ వేణి మాధవ మందిర్: పంచ మాధవ క్షేత్రాలలో ఒకటైన ఈ ప్రాచీన శ్రీ వేణి మాధవ ఆలయాన్ని సందర్శించకుంటే, ప్రయాగరాజ్ తీర్థయాత్ర అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయానికి ప్రయాగరాజ్ క్షేత్రానికి ఎంతో అవినాభావ సంబంధం కలిగి ఉంది.
ఒకప్పుడు గజకర్ణుడు అనే రాక్షసుడు త్రివేణి సంగమ జలాలను మొత్తం త్రాగేసి లోక కళ్యాణార్థం యజ్ఞ యాగాదులు చేసే మునులకు, నైమిత్తిక కర్మలు ఆచరించే సాధు పుంగవులకు, పాప నివృత్తిని కోరే సాధారణ భక్త జనకోటికి పుణ్యతీర్థం లేకుండా చేసి విఘాతం కలిగించాడు. అందరి విజ్ఞాపన మేరకు, విష్ణువు గజకర్ణుడుని సంహరించి, త్రివేణి సంగమ జలాల పవిత్రతను పునరుద్ధరించి, శాశ్వతంగా ప్రయాగరాజ్ ప్రదేశానికి క్షేత్రపాలకుడిగా ఇక్కడ కొలువై ఉండిపోయాడు.
2. త్రివేణి సంగమం: గంగ, యమున మరియు సరస్వతి అనే మూడు పవిత్ర నదుల సంగమం. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. గంగ-యమున నదీ జలాలు వేర్వేరు రంగుల్లో ఉంటాయి, వాటి సంగమ ప్రాంతంలో ఈ వ్యత్యాసాన్ని స్పష్టంగా గమనించవచ్చు.
త్రివేణి సంగమం కేవలం ఒక సహజమైన అద్భుతం మాత్రమే కాదు; భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, తమ పాపాలను తొలగించుకునే ఒక ఆధ్యాత్మిక తీర్థం. అలాగే వేణి దానం, పితృ కర్మలు మొదలైనవి ఇక్కడ జరిపితే విశేష ఫలితం కలుగుతుందని చెబుతారు.
ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి త్రివేణి సంగమ ప్రాంతంలో జరిగే మహా కుంభమేళా ప్రపంచం నలుమూలల నుండి వచ్చే కోట్లాది మంది భక్తులు, సాధువులు మరియు పర్యాటకులతో కిటకిటలాడుతుంది.
3. శ్రీ బడే హనుమాన్ మందిర్: ప్రయాగరాజ్‌లోని త్రివేణి సంగమ ప్రాంతానికి దగ్గరిలో ఉండే శ్రీ బడే హనుమాన్ మందిరానికి ఒక ప్రత్యేకత ఉన్నది. 20 అడుగులు పొడుగుతో హనుమంతుడు శయన భంగిమలో దర్శనమిచ్చే ఇలాంటి ఆలయం దేశంలో మరెక్కడా కానరాదు.
| అదనపు సమాచారం: తిరుమల యాత్రలో తప్పకుండా చూడాల్సిన జాపాలి తీర్థం !!
మరొక విషయం ఏమిటంటే, అక్బర్ చక్రవర్తి ఈ ప్రాంతంలో ఒక కోటను నిర్మించాలని భావిస్తాడు, అందుకు ఈ హనుమాన్ ఆలయం అడ్డుగా ఉందని కూలద్రోయాలని ప్రయత్నిస్తాడు. అయితే ఈ విగ్రహాన్ని ఇసుమంత కూడా కదల్చలేక చివరికి ఓటమి భారంతో హనుమాన్ మందిరం వెనుకనే తన కోటను నిర్మించుకున్నాడు.
4. అలోపి శాంకరీ దేవి శక్తిపీఠం: భారతదేశంలోని అష్టాదశ శక్తిపీఠాలలో ఇది ఒకటి; సతీదేవి వేళ్లు పడిన క్షేత్రంగా చెబుతారు. ఈ ఆలయం లోపల అమ్మవారికి విగ్రహం ఉండదు, బదులుగా ఒక చెక్క డోలీ (ఊయల) ఉంటుంది.
ఒక కథనం ప్రకారం, కొత్తగా పెళ్లయిన ఒక వధువు పల్లకీలో ఈ అడవి మార్గంలో వెళుతున్నప్పుడు, బందిపోటు దొంగలు అందర్నీ చంపి వారి దగ్గరున్న విలువైన వస్తువులు దోచుకుంటారు. ఇక పల్లకీలో ఉన్న నవ వధువును పట్టుకోవాలని ప్రయత్నించగా, ఆమె ఆశ్చర్యంగా అదృశ్యం అవడం జరుగుతుంది. స్థానికులు ఆ వధువునే అలోపి మాతగా భావించి పూజించడం ప్రారంభించారు.
5. చంద్రశేఖర్ ఆజాద్ పార్క్: నగరం నడిబొడ్డులో ఉండే ఈ పార్క్ కి ఆల్ఫ్రెడ్ పార్క్ మరియు కంపెనీ గార్డెన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా, విప్లవకారుడు చంద్రశేఖర్ సీతారాం తివారీ (ఆజాద్) తన జీవితాన్ని ఇక్కడే త్యాగం చేశాడు.
1931 సంవత్సరంలో ఫిబ్రవరి 27న చంద్రశేఖర్ ఆజాద్ ఈ ఆల్ఫ్రెడ్ పార్క్ లో ఉన్నాడన్న విషయం తెలుసుకున్న బ్రిటిష్ పోలీసులు తమ బలగాలతో పార్క్ మొత్తం మోహరించడం జరుగుతుంది. ఇక హోరాహోరీ తుపాకీ కాల్పుల తర్వాత, ఆజాద్ బ్రిటిష్ పోలీసులు చేతిలో చనిపోవడం ఇష్టం లేక, తన కణతకు తానే గురిపెట్టుకుని పిస్తోల్ తో కాల్చుకుని ఎంతోమంది విప్లవ వీరులకు ఉద్యమ స్పూర్తినిచ్చి దేశభక్తిని చాటుకున్నాడు.
ప్రతీ రోజు సాయంత్రం ఈ పార్క్ లో 1 గంట 45 నిముషాల పాటు లైట్ & సౌండ్ షో ఉంటుంది. పార్క్ ఎంట్రన్స్ కి మరియు లైట్ షో కి టిక్కెట్లు వేర్వేరుగా తీసుకోవాలి. అలాగే ఈ పార్క్ లోపల ఉండే విక్టోరియా మెమోరియల్, గవర్నమెంట్ పబ్లిక్ లైబ్రరీ, అలహాబాద్ మ్యూజియం కూడా తప్పకుండా చూడాల్సినవే. చంద్రశేఖర్ ఆజాద్ ఆల్ఫ్రెడ్ పార్క్‌లో ఉపయోగించిన పిస్తోల్ నేటికీ ఈ అలహాబాద్ మ్యూజియంలోనే ఉంది.
దరిద్ర దేవత (నెగెటివ్ ఎనర్జీ) ను బయటకు పంపించాలంటే...Cycle Naivedya Sambrani Dhoop Cups for Pooja (60 pcs) |
Advertisement* |
మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!
Comments
Post a Comment