పంచ భాస్కర స్థలాలలో ఒకటైన సూర్య దేవాలయం చెన్నైలో ఎక్కడ ఉందో తెలుసా ?!

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర ! దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే !!

సూర్యుడు మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం. ఆరోగ్య ప్రదాత కూడా. సాధారణంగా మనష్యులకు సూర్యుని యొక్క వివిధ పేర్లను పెట్టడం చూసి ఉంటాము. కానీ ఇపుడు మనం ఏకంగా సూర్యుడు అనే పేరుతో ఉన్న ఒక గ్రామం గురించి తెలుసుకుందాం !!

జ్ఞాయిరు గ్రామంలోని సూర్య దేవాలయం చెన్నై చుట్టూ ఉన్న నవగ్రహ ఆలయాలలో ఒకటి. జ్ఞాయిరు అంటే తమిళంలో సూర్యుడు అని అర్థం. అలాగే తమిళనాడులో ఉన్న “పంచ భాస్కర” స్థలాలలో ఒకటిగా ఈ ఆలయం ప్రసిద్దికెక్కింది.
Gnayiru Suryanar Temple

చెన్నై శివార్లలో ఉన్న రెడ్ హిల్స్ కు 15 కిలోమీటర్ల దూరంలో ఈ జ్ఞాయిరు గ్రామం ఉంది. జ్ఞాయిరు గ్రామానికి వెళ్ళే దారి పంటపొలాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

వాస్తు దోష పరిహారం: Comelyns - Sun God Wall Decor - Brass, 290gms, 20x20X4 cm
Advertisement*

జ్ఞాయిరు గ్రామంలోని సూర్య దేవాలయానికి దాదాపు 1500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయానికి ప్రవేశద్వారంగా 5 అంచెల చిన్న రాజగోపురం దక్షిణ దిక్కులో ఉంది. చుట్టూ పచ్చని చెట్ల మధ్య, పూల మొక్కలతో ఈ ఆలయ ప్రాంగణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
Gnayiru Suryanar Temple

ఇక్కడ ప్రధాన దైవం- స్వయంభువుగా వెలసిన శ్రీ పుష్పరథేశ్వరస్వామి. ప్రధాన ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. ఇక సూర్య భగవాన్ వారి సన్నిధి, ప్రధాన ఆలయంలోపల శ్రీ పుష్పరథేశ్వరస్వామి వారికి ఎదురుగా ఉంటుంది.

ఇక్కడ ప్రతి ఆదివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే భక్తులు స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి గోధుమలు, ఎర్రటి పుష్పాలు, ఎర్రటి వస్త్రం మొదలైనవి సమర్పించడం మరియు గోధుమలపై ప్రమిదలు ఉంచి దీపాలను వెలిగించడం వంటివి చేస్తారు.
Gnayiru Suryanar Temple

ఇక్కడ వెలసిన అమ్మవారికి స్వర్ణాంబిక అని పేరు. ప్రధాన ఆలయానికి ఎడమ వైపున స్వర్ణాంబిక అమ్మవారికి ప్రత్యేక సన్నిధి ఉంది.

ఈ ఆలయం వెనుక ఉన్న సూర్య పుష్కరిణిలోని నీటికి ఔషధ శక్తి ఉందని చెబుతారు. చర్మవ్యాధులు మరియు కంటికి సంబంధించిన రోగాలను నయం చేస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయానికి సంబంధించి మూడు కథలు ప్రాశస్త్యంలో వున్నాయి.
Gnayiru Suryanar Temple

సూర్యుడు ఒకసారి ఎందుకో బ్రహ్మ చేత శపించబడతాడు. సూర్యుడు శాపం నుండి నయం కావాలని ఇక్కడ చెరువులో స్నానం చేసి ఎర్ర తామరపువ్వులతో శివుడిని ప్రార్థించి, తపస్సు చేస్తాడు. దాంతో సూర్యుడి భక్తికి మెచ్చిన శివుడు వేయిరేకుల ఉన్న తామరపుష్పంపై దర్శనం ఇచ్చి శాప విమోచనం ఇస్తాడు.

అందుకే ఇక్కడ నెలకొన్న శివునికి శ్రీపుష్పరథేశ్వరస్వామి అని పేరు. ఏప్రిల్-మే నెలల మధ్యలో వచ్చే చైత్ర మాసంలో, ఒక వారం పాటు సూర్యకిరణాలు పుష్పరథేశ్వరస్వామి వారి మీద, అలాగే స్వర్ణాంబిక అమ్మవారి మీద నేరుగా పడతాయి.
Gnayiru Suryanar Temple

ఇక రెండవ కథ ప్రకారం- కాశీకి వెళుతున్న చోళరాజు మార్గమధ్యలో ఈ ప్రాంతంలో బస చేస్తాడు. ఇక్కడ వున్న చెరువులోని ఒక తామరపువ్వు వైపు ఆకర్షితుడై దానిని తుంపబోయే క్రమంలో తన కంటి చూపును కోల్పోతాడు. అప్పుడు పరమ శివుడిని ప్రార్థించగా, ఒక కంటికి చూపునిస్తాడు.

చోళరాజు కాశీని సందర్శించి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించడంతో మరొక కంటికి కూడా చూపు వస్తుంది. అందుకే కంటికి సంబంధించిన వ్యాధులను నయం చేసుకోవడానికి భక్తులు ఇక్కడకు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు.
Gnayiru Suryanar Temple

మరొక కథ ఏమిటంటే- ఒకసారి చోళరాజు వేరే రాజ్యంపై గెలిచి విజయోత్సవంతో తిరిగి వస్తున్నపుడు చోళవరంలో బస చేస్తాడు. మర్నాడు ఉదయం శివరాధనకై ఒక చెరువులో స్నానం చేసి, అందులో ఉన్న తామరపువ్వును కొయ్యబోతాడు. అప్పుడు ఆ తామరపువ్వు ముందుకు జరుగుతుంది. దానిని అందుకోవడానికి ముందుకు వెళ్ళితే, అది మరింత ముందుకు జరుగుతుంది.

దాంతో చోళరాజు చాలా కోపంతో తన కత్తిని పువ్వు మీదకు విసురుతాడు. చాలా ఆశ్చర్యంగా కత్తి ముక్కలుగా విరుగుతుంది. ఆ విరిగిన ముక్కల్లో ఒకటి చెరువులో ఉన్న శివలింగం మీద పడడంతో, దెబ్బ తగిలి శివలింగం నుండి రక్తం కారడం వల్ల చెరువు మొత్తం ఎర్రగా మారుతుంది. ఆ మచ్చను ఇక్కడున్న శివలింగంపై ఇప్పటికీ చూడవచ్చు.
Gnayiru Suryanar Temple

ఈ క్షేత్రానికి స్థల వృక్షం- తామర. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో చాలా అరుదైన నాగలింగ వృక్షం మరియు ఔషధ గుణాలు కలిగిన తిరువోడు వృక్షాలను చూడవచ్చు. సాధువులు ఎండిన తిరువోడు చెట్టు కాయలను భిక్ష పాత్రలుగా వాడుతారు.

పెరియపురాణంలో జ్ఞాయిరు గ్రామాన్ని గురించి ప్రస్తావించి, ఈ ఆలయం యొక్క స్థల పురాణాన్ని ప్రశంసించారు. పరమ శివ భక్తులలో ఒకరైన సుందర నాయనార్ యొక్క భార్య సంగిలి నాచియార్ ఈ గ్రామంలోనే జన్మించింది. అలాగే శకుంతులకు పెంపుడు తండ్రి అయిన కణ్వ మహర్షికి ఇక్కడే ముక్తి లభించింది.

| అదనపు సమాచారం: కుంభకోణం సమీపంలో ఉన్న సూర్యనార్ కోవిల్ ప్రత్యేకత ఏమిటో తెలుసా?

Gnayiru Suryanar Temple

ఇక్కడ దక్షిణదిక్కులో ఉన్న రాజగోపురానికి ఆనుకుని కొత్తగా నిర్మించిన స్వర్ణ కళ్యాణరామ ఆలయాన్ని తప్పకుండా చూడాల్సిందే!! ఈ ఆలయంలో శ్రీ సీతాసమేత కళ్యాణరాముల వారికి, శ్రీ ఆంజనేయస్వామి వారికి, శ్రీ సుదర్శనస్వామి వారికి మరియు శ్రీ యోగనరసింహస్వామి వారికి వేరు వేరు మందిరాలు ఉన్నాయి.
Gnayiru Suryanar Temple

ఈ ఆలయానికి ఇరువైపులా వాహనాలు నిలపడానికి సరిపడా ఉచిత పార్కింగ్ వసతి సౌకర్యం అందుబాటులో ఉంది. అలాగే ఆలయ సందర్శనానికి చెన్నై కోయంబేడు నుండి జ్ఞాయిరు గ్రామానికి నేరుగా 114G బస్ సౌకర్యం కూడా ఉంది.
Gnayiru Suryanar Temple

పొడిబారిన కళ్ళకు ఉపశమనం: Refresh Tears - Bottle of 10 ml Drops
Advertisement*

ఓం నమో సూర్య దేవాయ నమః !! మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!

Comments