తిరుపోరూర్: సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తారకాసురుడుతో ఆకాశంలో యుద్ధం చేసి గెలిచిన క్షేత్రం !!
తిరుపోరూర్ కందస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లాలో ఉంది. ఇది చెన్నైకి 30 కిలోమీటర్లు, అలాగే మహాబలిపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కొలిచే శివ-పార్వతుల తనయుడైన స్కందుడుని తమిళనాడులో "కందస్వామి" అని పిలుస్తారు.
తమిళంలో తిరు అంటే గౌరవ వాచకం, పోర్ అంటే యుద్ధం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తారకాసురుడు అనే రాక్షసుడితో ఆకాశంలో యుద్ధం చేసి గెలవడంతో, ఈ ప్రాంతానికి "తిరు-పోర్-ఊర్" అని పేరు వచ్చింది. అలాగే ఈ ప్రాంతాన్ని సమరపురి మరియు తారకాపురి అని కూడా పిలిచేవారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, అగస్త్య మునికి వేదాలకు పునాది అయిన ప్రణవం గురించి వివరించాడని చెబుతారు.
మదురైకి చెందిన చిదంబర స్వామి అనే సాధువు ఒక తాటిచెట్టు క్రిందనున్న పుట్టలో ఇప్పుడున్న విగ్రహాలను కనుగొన్నారని స్థలపురాణం చెబుతోంది. అందుకే స్వయంభువుగా వెలిసిన ఈ విగ్రహమూర్తులకు అభిషేకాలు ఉండవు, అన్ని ప్రత్యేక అభిషేకాలు ఇక్కడున్న సుబ్రహ్మణ్య యంత్రానికి మాత్రమే చేస్తారు.
తొలుత 10వ శతాబ్దంలో పల్లవులచే నిర్మించబడిన ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో మరింతగా విస్తరించారని శాసనాలు చెబుతున్నాయి.
| మీ కారులో ఓం మురుగ !! Elite Store Metal OM Vel Golden Tamil Alphabet - 9 cm |
| Advertisement* |
అరుణగిరినాథర్, రామలింగ వల్లలార్, పంబన్ స్వామి వంటి సిద్ధ యోగులు ఈ తిరుపోరూర్ ఆలయ వైభవాన్ని తెలియచెప్పి, ఎంతో భక్తితో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్తుతించారు.
వల్లి, దేవసేన సమేతుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక చేతిలో శక్తివేల్ అనే ఆయుధాన్ని చేపట్టి తన భక్తులకు ఎలప్పుడు అభయం ఇస్తున్నట్లుగా కొలువుదీరి ఉంటాడు. శక్తివేల్ ఆయుధాన్ని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి చెన్నైలోని మైలాపురంలో వెలిసిన తన తల్లితండ్రులైన కపాలీశ్వరుడు, కర్పగాంబాళ్ నుంచి పొందాడన్న విషయం మనకు తెలిసినదే.
| అదనపు సమాచారం: చెన్నై శ్రీ కపాలీశ్వర్ ఆలయం: "మైలాపురమే కైలాసం-కైలాసమే మైలాపురం” అని ఎందుకు అంటారు?
ఈ ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్యలైన వల్లి, దేవసేనలకు అలాగే అతని సోదరుడైన గణపతికి మరియు ఇతర దేవతలకు వేర్వేరు ఉపాలయాలు కూడా ఉన్నాయి.
కుజదోషం ఉన్నవారు, ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత లోపించినవారు, అలాగే వివాహ ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్న భక్తులు ఈ ఆలయాన్ని తప్పనిసరిగా దర్శించుకుని సుబ్రహ్మణ్య యంత్రానికి అభిషేకం చేయిస్తారు.
| ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms |
| Advertisement* |
సంక్రాతి పండగల్లో పాల కావడి, మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు, మే-జూన్ నెలల్లో వైకాసి విశాఖ, అలాగే అక్టోబర్-నవంబర్ నెలల్లో కందషష్టి మరియు నవరాత్రులు ఇక్కడ చాలా వైభవంగా జరుగుతాయి. ఇక్కడ పుష్కరిణికి ఆనుకుని ఉన్న ఒక కళ్యాణకట్టలో భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు.
ఈ ఆలయానికి సమీపంలో "ప్రణవమలై" అనే ఒక చిన్న కొండపై శివపార్వతులైన కైలాసనాథ స్వామి, బాలాంబిక అమ్మవార్లకు వేరుగా ఆలయాలు ఉంటాయి. అక్కడ నుంచి తిరుపోరూర్ కందస్వామి ఆలయం యొక్క గోపురం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ ఆలయం ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు మరియు సాయంత్రం 3.30 నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది.
ఇంతటి మహిమాన్విత తిరుపోరూర్ కందస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరు ప్రముఖ క్షేత్రాలకు (ఆరుపడై వీడు) సమానంగా విరాజిల్లుతోంది.
ఓం శరవణ భవ !!
.jpg)
Comments
Post a Comment