శని ప్రభావం చాలా తీవ్రంగా ఉందా? అయితే తిరునల్లార్ శనీశ్వర భగవాన్ ఆలయం దర్శించండి !!
సాధారణంగా శని భగవాన్ ఆలయం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది మహారాష్ట్రలో ఉన్న శని శింగనాపూర్ లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లాలోని మందపల్లి క్షేత్రం. ఇవి కాకుండా ద్రవిడ దేశంలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన, చోళ రాజులచే నిర్మించబడిన పురాతన “తిరునల్లార్” ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ శనీశ్వర భగవాన్ స్థలంగా పిలువబడే తిరునల్లార్ కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ఉంది. ఇది కారైకల్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో, అలాగే తమిళనాడులో ప్రసిద్ధి గాంచిన చిదంబరం, కుంభకోణం క్షేత్రాలకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. కుంభకోణం చుట్టూ ఉన్న ప్రముఖమైన నవగ్రహ ఆలయాల్లో ఇది ఒకటి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రధాన దైవం- పరమ శివుడు. స్వయంభువుగా వెలసిన ఈయన్ని దర్భారణ్యేశ్వర స్వామి అని, అమ్మవారిని ప్రాణాంబికా దేవి అని కొలుస్తారు. ఇంతకుముందు ఈ క్షేత్రాన్ని ఆదిపురి, దర్భారణ్యం, నాగవిడంగపురం, నలేశ్వరం మొదలైన పేర్లతో పిలిచేవారు. ఇక్కడున్న శివలింగం దర్భగడ్డితో ఏర్పడిందిగా చెప్తారు. శని ప్రభావంతో పీడించబడుతున్న నలమహారాజు, భరద్వాజ ముని సలహా ప్రకారం, ఇక్కడకు వచ్చి కోనేరులో స్నానం ఆచరించి...